రాజకీయం చేసే విషయం కాదు: దీపాదాస్ మున్షీ 

– మృతుని కుటుంబానికి అండగా ఉందాం..
– గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే దీనికి కారణం..
– నేత కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..
– మృతి చెందిన నేత కార్మికుని కుటుంబాన్ని పరామర్శించిన దీపాదాస్ మున్షీ 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గత 10 సంవత్సరాలుగా నేత కార్మికులతో పని చేయించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడం వలన నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కమిటీ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డ నేత కార్మికుడు అంకారపు మల్లేశం కుటుంబాన్ని శనివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సిరిసిల్లలో 27 వేల పవర్లూమ్స్ ఉన్నాయని,చాలా కుటుంబాలు వస్త్ర పరిశ్రమపై ఆధారపడి ఉన్నారాన్నారు.గత పది సంవత్సరాల నుండి నేత కార్మికులకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం పనులు ఇచ్చారు.. కానీ దానికి సంబంధించిన బిల్లులను చెల్లించలేదన్నారు.దీనివల్ల పవర్ లూమ్స్ పరిశ్రమ కదా కొద్దిరోజులు మూతపడ్డాయి అన్నారు. వస్త్ర పరిశ్రమల్లో కార్మికులకు పనులు దొరకక ఎంతోమంది ఇబ్బందిపడి కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇవి ఆత్మహత్యలు కావని ఇవి ముమ్మాటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని వారు ఆరోపించారు. నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం చాలా బాధాకరమన్నారు. ఇది రాజకీయం చేసే సమయం కాదని నేత కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని నేత కార్మికులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇతర పార్టీ నాయకులు ఈ విషయంపై రాజకీయాలు చేయడానికి చూస్తున్నారు కానీ మేము వీటిపై ఎలాంటి రాజకీయం చేయదలచుకోలేదన్నారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి మేము ఇప్పుడు ఎలాంటి హామీలను ఇవ్వలేమన్నారు. కానీ ఎన్నికల తర్వాత నేత కార్మిక కుటుంబాలకు సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు.ఇక్కడికి రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు..బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉండేందుకు వచ్చానన్నారు.ఎన్నికలు అయిపోగానే ఇక్కడికి వచ్చి సంబంధిత మంత్రి, అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారాన్నారు.నేత కార్మికులకు పూర్తి స్థాయిలో పని కల్పించడంతో పాటు, చేనేత కార్మికుల సంక్షేమానికి కొత్త పాలసీలు తెస్తామని స్పష్టం చేశారు.నేతన్నల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.చేనేత కార్మికుల సంక్షేమానికి కొత్త పథకాలను ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. నేత,చేనేత కార్మికుల కుటుంబాల పక్షాన  మేమందరం ఉన్నాం..అందరికీ అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అది చేస్తాం..ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పం.. ఈ కుటుంబాలకు అండగ ఉండి ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Spread the love