నవతెలంగాణ – ఆర్మూర్
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్ అన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో 34 ఇళ్లు మంజూరు కావడంతో, మంగళవారం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి కృషితో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఇల్లు లేని అర్హులైన నిరుపేదలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఇతర సామాజిక వర్గాలకు ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. పథకం కింద ప్రభుత్వం నిర్ణయించిన విధంగా దశలవారీగా నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు నారాయణ, చిరంజీవి, భాస్కర్, మహేష్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైస్ మల్లారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉదయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి , నవనీత్ ,బీరయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.



