పైకే ఐక్యత…లోపల అనైక్యతే!

– మధ్యలోనే వెళ్లిపోయిన విజయశాంతి
– పలువురు నేతల డుమ్మా
– మాట్లాడేందుకు వివేక్‌కు దక్కని అవకాశం
– ఈటల, రఘునందన్‌పై బండి మాటల తూటా
– తాను ఏడ్చానంటూ రాజగోపాల్‌రెడ్డి ఓపెన్‌
– ముభావంగా ఈటల, రఘునందన్‌రావు
– సంజరు ఆవేదన సభగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో మేమంతా ఐక్యంగా ఉన్నామం టూనే నేతలు మాటల తూటా లను పేల్చేశారు. ఇతర నేతలపై తమ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. మా ఐక్యతపైకే..లోపల అసమ్మతి రగులుతూనే ఉందనే వాస్తవం వారి మాటల్లోనే బయటపడింది. నేతల మధ్య అనైక్యత బాహాటంగానే ఆ సభలో వ్యక్తమైంది. చివరకు కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సభ కాస్తా బండి సంజయ్ ఆవేదన సభగా మారింది. మాట్లాడిన ప్రతిఒక్కరూ బండిని పొగుడుతున్న సందర్భాల్లో ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు ముభావంగా కనిపించారు. ‘కొందరు ఢిల్లీకి తప్పుడు ఫిర్యాదులు చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇకనైనా లేనిపోని ఫిర్యాదులు చేయడం మానండి. కిషన్‌రెడ్డినయినా ప్రశాంతంగా పనిచేయనివ్వండి. ఇప్పుడు కాకుంటే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టం…’ అంటూ బండి సంజయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘పత్రికల్లో ఉండేవాళ్లు ప్రజల్లో ఉండలేరు. సోషల్‌మీడియా, పత్రికలు, మీడియాల్లో కాదు ప్రజల్లో ఉండండి’ అని సూచన చేస్తూ సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. బండి చురకలతో ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు ముఖాలు వాడిపోయాయి.
సంజరు మాటలు ఆ ఇద్దరికీ సూటిగా తగిలేలా ఉన్నాయని కమలం పార్టీలో చర్చ నడుస్తున్నది. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటి కాదని చెప్పేక్రమంలో లిక్కర్‌ కేసులో తన కుమార్తె కవితను కాపాడేందుకు కేసీఆర్‌ ఈడీని మ్యానేజ్‌ చేశారంటూ రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య స్నేహం లేదంటూనే…కమలం పార్టీని రాజగోపాల్‌రెడ్డి మరింత ఇరకాటంలోకి నెట్టారంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. బండిని చూస్తే ఏడుపొస్తోందనీ, బాత్‌రూమ్‌లోకెళ్లి ఏడ్చేశానంటూ కూడా కోమటిరెడ్డి ఓపెన్‌ అయిపోయారు. ఎంపీ సోయం బాబూరావు మాట్లాడే క్రమంలో బీజేపీ కార్యకర్తలు కొందరు సంతృప్తిగా ఉన్నారు..మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు..అందరూ ఐక్యంగా ఉంటేనే కేసీఆర్‌ను ఓడగొట్టగలుగుతామంటూ బీజేపీలో నెలకొన్న అనైక్యతను ఎత్తిచూపారు.
ఈటల ముందే ఎందుకు?
ఏ పార్టీ సభల్లోనైనా ముందు నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత ఆ పార్టీలో అత్యంత ముఖ్యనేతలు మాట్లాడటం ఒక ఆనవాయితీ. ఇప్పుడు బీజేపీలో కిషన్‌రెడ్డి అధ్యక్షులుకాగా, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్‌ హోదాలో ఈటల రాజేందర్‌ కూడా ప్రాధాన్యతా పదవిలో ఉన్నారు. కానీ, సభలో ఈటల రాజేందర్‌తో ముందే మాట్లాడించారు. ఆ తర్వాత లక్ష్మణ్‌, మురళీధర్‌రావు, డీకే, బండి, కిషన్‌రెడ్డి తదితర నేతలు మాట్లాడారు. దీంతో పార్టీలో ఈటలకు అంత ప్రాధాన్యతే లేదనే చర్చ బీజేపీ శ్రేణుల్లోనే మొదలైంది. మరోవైపు జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌కు సభలో మాట్లాడే అవకాశం దక్కకపోవడమూ విమర్శలకు తావిస్తున్నది.
మధ్యలోనే వెళ్లిపోయిన రాములక్క
విజయశాంతి సభ చివర వరకు ఉండకుండా మధ్యలోనే వెళ్లి పోవడమూ చర్చనీయాంశమైంది. ఆమె వెళ్తున్న క్రమంలో కొందరు నేతలు గుసగుసలాడుకున్నారు. ‘తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతి రేకించిన వాళ్లు స్టేజీపై ఉన్నారు. తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారూ అక్కడ ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకులు అక్కడ ఉండటంతో అసౌకర్యంగా ఫీల్‌ అయ్యాను. అక్కడ చివరి వరకు ఉండటం అసాధ్యం. అందుకే కార్యక్రమం ముగియకముందే అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది’ అంటూ విజయశాంతి సోషల్‌ మీడియా సాక్షిగా బాంబు పేల్చేశారు. ఈ వ్యాఖ్యలు కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి చేసినవేనని ప్రచారం జరుగుతున్నది.
కిషన్‌రెడ్డి ఆహ్వానించినా డుమ్మానే
త్వరలో బీజేపీని వీడబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న ఏనుగు రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, జిట్టా బాలకృష్ణారెడ్డి సభకు డుమ్మాకొట్టారు. తన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి, సభకు రావాలని కిషన్‌రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించినప్పటికీ నేతలు రాకపోవడం బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతున్నది. అంతిమంగా సభలో మాట్లాడినవాళ్లంతా సంజరు పట్ల సానుభూతి ప్రకటించడంతో కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సభ కాస్తా బండి ఆవేదన సభగా మారినట్టు అనిపించింది!

Spread the love