లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్‌ సాధించేంత వరకూ పోరాటం ఆపొద్దు

– జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం
– వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
– సాగునీరు ఇవ్వకుండా రియల్‌ ఎస్టేట్‌ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
– పాలమూరు అధ్యాయన వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్‌ హరగోపాల్‌
– లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ సాధన కోసం షాద్‌నగర్‌లో మహాధర్నా
నవతెలంగాణ-షాద్‌నగర్‌
సాగునీటిని ఇవ్వకుండా రియల్‌ ఎస్టేట్‌ను ప్రోత్సహిస్తూ ప్రజలను దోచుకునే పనిలో కేసీఆర్‌ ఉన్నారని జన సమితి అధ్యక్షులు ప్రొ|| కోదండరాం, వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిల, పాలమూరు అధ్యాయన వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ విమర్శించారు. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్‌ సాధించేంత వరకూ పోరాటం ఆగదని వారు స్పష్టంచేశారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌ సాధన కోసం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ముందుగా షాద్‌నగర్‌ ముఖ్య కూడలిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా మహా ధర్నాకు చేరుకున్నారు. కాంగ్రెస్‌, బీఎస్పీ, వైఎస్సార్‌టీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. అధికారం ఉందని ప్రజలను చిన్నచూపు చూడొద్దని, అధికారం ఇచ్చిన ప్రజలు అధికారాన్ని దూరం చేయడానికి వెనకడుగు వేయరని తెలిపారు. తెలంగాణ రావడానికి ఎన్నో ఉద్యమాలు చేశామని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను సాధించుకోవడానికి మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని స్పష్టంచేశారు. గ్రామగ్రామాన కమిటీలు వేసి ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రలో రైతన్నల గోడు తెలుసుకొని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సాగునీరు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఓట్ల లబ్ది కోసం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి తీరుతామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు ఏమయ్యారంటూ ప్రశ్నించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ ఆఖరి ఆరో పాయింట్‌గా సూచిస్తూ ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదని అన్నారు. మతతత్వ బీజేపీ రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయ హౌదా ఇవ్వకుండా మత కల్లోహాలు సృష్టించు కుంటూ ఆ చిచ్చులో చేతులు కాచుకుంటుందని విమర్శించారు. పాలమూరు అధ్యాయన వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఎకరాల్లో భూమిని కొని గజాల్లో ప్లాట్లు చేసి అమ్ముతున్నారని, దీనినంతటిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. తాను మొగిలిగిద్ద గ్రామవాసినిని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో హామీలు ఈ ప్రాంత అభివృద్ధికై ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఆ తర్వాత కాలంలో పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌ సాధనకై ఎన్నో సంద ర్భాల్లో ముఖ్యమంత్రితో కలవడానికి ప్రయత్నం చేయగా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1000 కోట్లు అయితే లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Spread the love