నూతన వరి వంగడాలపై ముఖాముఖి
నవతెలంగాణ-వైరా
రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు వరి సాగు, నూతన వరి వంగడాలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రైతులు, వ్యవసాయాధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ప్రస్తుత సీజన్లో రైతులు అనుసరించాల్సిన సాగు, యాజమాన్య పద్దతులను చర్చించారు. వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్, మే మాసాలలో వస్తున్న గాలి దుమారాలు, అకాల వర్షాల నేపథ్యంలో ముందస్తు వరి సాగు ఆవశ్యకతను, నూతన వరి వంగడాలను వివరించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేటెడ్ డైరెక్టర్ డా// ఉమారెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ నెల చివరినాటికి వానకాలపు వరిని ముగించడంతో పాటు యాసంగి వరి సాగును సకాలంలో పూర్తి చేసుకుంటే గాలి దుమారాలు, అకాల వర్షాల నుండి యాసంగి పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ దశలో వ్యవసాయ అధికారులు సాంకేతికతను అలవర్చుకుని రైతులను ఆ దిశ గా సమాయత్తం చేయాలని కోరారు. జేడిఎ ఎం.విజయ నిర్మల మాట్లాడుతూ డ్రోన్ల ఆవశ్యకత, వాటి ఉపయోగంపై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల ద్వారా సాంకేతికతను తీసుకుని రైతులను కూడా చైతన్య పరిచాలని వివరించారు. వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసే వరి వంగడాల రకాలను, వాటి గుణగణాలను వివరించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ ప్రధాన శాస్త్రవేత్త దామోదర రాజు మాట్లాడుతూ వానాకాలం వరిలో నేరుగా నాటే పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో రాణా ప్రతాప్, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్ కుమార్, శాస్త్రవేత్తలు సునీత, ఝాన్సీ, రవికుమార్, చైతన్య, ఫణి శ్రీ, నాగరాజు, సతీష్ చంద్ర, కిరణ్ బాబు, జిల్లా వ్యవసాయాధికారులు వైరా ఏడియే బాబురావు, ఏఓలు పవన్ కుమార్, బాలాజీ రైతులు తదితరులు పాల్గొన్నారు.