మంతెన గ్రూపుపై ఈడీ కేసు కొట్టివేత

హైదరాబాద్‌ : మనీ లాండరింగ్‌ కేసులో మాక్స్‌ మంతెన అనే ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) పెట్టిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసిందని మంతెన గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. తమ గ్రూపు ప్రమోటర్‌ ఎంఎస్‌ రాజును ఈ కేసులో నిర్దోషిగా తేల్చినట్లు పేర్కొంది. ఇడి పెట్టిన హవాలా కేసులో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా మంతెనపై చర్యలు చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్‌ పేర్కొన్నారు. కేవలం అనుమానమే నమ్మకానికి కారణం కాదని తెలిపారని పేర్కొంది. మధ్యప్రదేశ్‌ ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో జారీ చేసిన ఇ-టెండర్‌ను అనధికారికంగా మంతెన గ్రూప్‌ యాక్సెస్‌ చేశారని, రూ.1,030 కోట్ల విలువైన నీటిపారుదల శాఖ టెండర్‌ ధర బిడ్లను తారుమారు చేశారని ఇడి ఆరోపించింది. టెండర్‌ జారీచేసే అధికారి డిజిటల్‌ సంతకాన్ని దుర్వినియోగం చేశారని, 2016 నుంచి రూ.80,000 కోట్ల విలువైన టెండర్లలో రిగ్గింగ్‌ జరిగిందని ఇడి ఆరోపించింది. అయితే..ఆ తర్వాత ఈ అనుమానాలను రుజువు చేయడంలో ఇడి విఫలమైంది. అయినా ఈ అనుమానాల ఆధారంగానే హవాలా చట్టం కింద ఇడి కేసు నమోదు చేసింది.

Spread the love