పట్టణ ఓటర్లపై రాజకీయ ప్రకటనల ప్రభావం

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ప్రకటనలు పట్టణ ఓటర్లపై ప్రభావం చూపాయని యూగవ్‌ సంస్థ నిర్వహించిన సర్వే తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి పది మంది పట్టణ ఓటర్లలో ఆరుగురు బీజేపీ ప్రకటనల కారణంగా ప్రభావితులయ్యారని ఆ సర్వే తేల్చింది. ఎన్నికల సమయంలో తాము రాజకీయ ప్రకటనలు చూశామని 76శాతం మంది తెలుపగా కేవలం 14శాతం మంది మాత్రమే వాటిని పట్టించుకోలేదని చెప్పారు. కనీసం ఒక ప్రకటన అయినా చూశామని చెప్పిన వారిలో 81 శాతం మంది బీజేపీ యాడ్స్‌ను వీక్షించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రకటనలు చూశామని 47శాతం మంది తెలియజేశారు. అమ్‌ఆద్మీ పార్టీ ప్రకటనలు చూశామని కేవలం 12శాతం మంది మాత్రమే చెప్పారు. ఇతర పార్టీల యాడ్స్‌ను 7శాతం మంది చూశారు. 1981-1996 మధ్య జన్మించిన వారు ఎక్కువగా కాంగ్రెస్‌ ప్రకటనలు చూడడం గమనార్హం. రాజకీయ ప్రకటనలు వచ్చిన మాధ్యమాలలో యూట్యూబ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ వేదికలో తాము యాడ్స్‌ చూశామని 67 శాతం మంది తెలిపారు. 58 శాతం వీక్షకులతో టీవీ రెండో స్థానంలో నిలిచింది. 43 శాతం మందితో ఇన్‌స్టాగ్రామ్‌, 38 శాతం మందితో వాట్సప్‌, 35 శాతం మందితో మెటా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ ప్రకటనలు సృజనాత్మకంగా ఉన్నాయని 58 శాతం మంది పట్టణ ఓటర్లు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ యాడ్స్‌పై 28 శాతం మంది, ఆప్‌ ప్రకటనలపై 6 శాతం మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Spread the love