ప్రతిపక్షాల కూటమిలోకి మరో ఎనిమిది పార్టీలు

– 17, 18 తేదీల్లో ఐక్యతా సమావేశం
– అన్ని పార్టీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే లేఖలు
న్యూఢిల్లీ : బీజేపీని ఓడించేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలతో కలిసేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల కూటమిలో చేరేందుకు కొత్తగా ఎనిమిదికి పైగా పార్టీలు ముందుకొచ్చాయి. ఈ పార్టీలన్నీ బీజేపీ వ్యతిరేక కూటమి వెంట ఉంటామంటూ మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్షాలకు కొత్తగా మద్దతు ప్రకటించిన పార్టీలలో మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే), కొంగు దేశ మక్కల్‌ కట్చి (కేడీఎంకే), విడుదలై చిరుతైగళ్‌ కట్చి (వీసీకే), రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ (ఆర్‌ఎస్‌పీ), ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ), కేరళ కాంగ్రెస్‌ (జోసెఫ్‌), కేరళ కాంగ్రెస్‌ (మణి), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఉన్నాయి. గత జూన్‌ 23న బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అధ్యక్షతన పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో 16 పార్టీలు పాల్గొనగా, కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూర్‌లో తలపెట్టిన ప్రతిపక్షాల సమావేశంలో 23 పార్టీలు పాల్గొంటాయని ఆయా వర్గాలు తెలిపాయి. బెంగళూర్‌లో 17, 18 తేదీల్లో జరుగనున్న ఐక్యతా సమావేశంలో పాల్గొనాలని ప్రతిపక్ష పార్టీ నేతలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మంగళవారం ఆహ్వానించారు. 17 సాయంత్రం 6 గంటలకు బెంగళూర్‌లో సమావేశం, అనంతరం డిన్నర్‌ ఉంటుందని, జూలై 18న ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశం కొనసాగుతుందని ఖర్గే ఆ లేఖలో తెలిపారు. ‘ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న పలు అంశాలతో పాటు అనేక కీలక అంశాలను గత సమావేశంలో చర్చించాం. రాబోయే సార్వత్రిక ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవాలని ఏకగ్రీవంగా తీర్మానించడంతో పాట్నా సమావేశం విజయవంతమైంది’ అని ఆ లేఖలో ఖర్గే పేర్కొన్నారు.

Spread the love