ఆర్టీసీలో తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి

ఆర్టీసీలో తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత ప్రభుత్వ కాలంలో దీర్ఘకాలికంగా ఆర్టీసీలో పనిచేసి స్వల్పకారణాలతో తొలగించబడిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు వంటి వివిధ శాఖలలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుమారు 1,500 పైగా చిన్నచిన్న ఉద్యోగులను స్వల్పకారణాలతో విధుల నుంచి తొలగించడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలగించిన ఆర్టీసీ కార్మికులందరూ సుమారు ఐదు నుంచి 20 ఏండ్లపాటు నిరంతరంగా సంస్థ కోసం సేవలంందిచారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో బస్సుల కండిషన్‌లు, టికెట్ల మిషన్‌లు వంటి వాటిని సరైన రీతిలో నిర్వహించకపోవడంతో అనేక ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఈ తప్పిందాలకు చిన్నచిన్న ఉద్యోగులను బాధ్యులుగా చేయడం విచారకరమని పేర్కొన్నారు. ఆర్టీసీలో భర్తీ చేయాల్సిన పోస్టులున్నాయనీ, వాటిలో ఈ తొలగించబడిన ఉద్యోగులను భర్తీచేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Spread the love