హైదరాబాద్‌లో దజోన్‌ సీఓఈ కేంద్రం ఏర్పాటు

 రూ.200 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌ : ప్రముఖ గ్లోబల్‌ స్పోర్ట్స్‌ స్ట్రీమింగ్‌ సర్వీస్‌ సంస్థ దజోన్‌ హైదరాబాద్‌లో తన ప్రధాన టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. నాలెడ్జ్‌ సిటీలోని అరబిందో గెలాక్సీలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చామని దజోన్‌ గ్రూప్‌ సీఈఓ షే సెగెవ్‌ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో షే సెగెవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రూ.200 కోట్ల పెట్టుబడులతో.. 2023 డిసెంబర్‌ నాటికి 1000 మందిని నియమించుకోవాలని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. ఐదు నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన తమ అత్యాధునిక కార్యాలయంలో ఇప్పటికే 350 మందికి పైగా పని చేస్తున్నారన్నారు. 2024 డిసెంబర్‌ నాటికి ఉద్యోగుల సంఖ్యను 2500కు పెంచనున్నామని తెలిపారు. ”హైదరాబాద్‌లో టెక్నాలజీ సీఓఈని ఏర్పాటుచేయడం సంతోషంగా ఉంది. ఇది అందించే అదనపు సాంకేతిక సామర్థ్యం.. అత్యున్నత స్పోర్ట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థగా మారడంలో మా రోడ్‌ మ్యాప్‌ను మరింత వేగవంతం చేస్తుంది.” అని షే సెగెవ్‌ చెప్పారు. దజోన్‌ గ్రూపు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సందీప్‌ టికు మాట్లాడుతూ, ”అధునాతన స్ట్రీమింగ్‌ టెక్నాలజీల ఆవిర్భావం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కంప్యూటర్‌ విజన్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఎఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (విఆర్‌), వేరబుల్‌ టెక్నాలజీతో క్రీడాభిమానులు ఇంతకు ముందు ఎప్పుడూ చవిచూడని సరికొత్త అనుభవాన్ని వారికి అందించే సామర్థ్యం తమ సంస్థకు ఉందన్నారు.

Spread the love