ఏప్రిల్ ఒక్కటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

– ఏప్రిల్ ఒక్కటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. రైతులు, నిర్వాహకులకు అవగాహన కల్పించండి.అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి.జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు.
నవ తెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని   కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ పకడ్బందీగా  ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట  ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో గురువారం ఆయా శాఖల అధికారులు , పిఎసిఎస్ చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి అధికారులు, సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుగా ఏప్రిల్ 01 వ తేదీ నుండి ప్రతి మండలంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆదేశించారు. జిల్లాలో యాసంగిలో 3.82.545  విస్తీర్ణంలో వరి పండించారని, 8.62,617 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికందుతుందని అంచనా వేశామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు.  వీటిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 63 కేంద్రాలు, ఐకెపి ద్వారా 158, డీసీఎంఎస్  ఆధ్వర్యంలో  15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందేలా సంబంధిత అధికారులు  క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం ‘ఏ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2203, సాధారణ రకానికి రూ. 2183 ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్నిమౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుండి 18 వరకు  జిల్లాలో  అన్ని  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.  పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తగిన నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు, ధాన్యం శుద్ధి యంత్రాలు, టార్పాలిన్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు.
సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని ఆదిశగా రైతులు, కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని మండల స్థాయిలో తహశీల్దార్లు,  వ్యవసాయ అధికారులు, ఏటీఎం లను  ఆదేశించారు.  రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, ముఖ్యంగా ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంట వెంట జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు సమకూర్చుకోవలని అన్నారు.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించకూడదని, అధికారులు ప్రారంభించుకోవాలని కలెక్టర్ సూచించారు. కేంద్రాల వద్ద ఫ్లెక్సీలలో కూడా ప్రజా ప్రతినిధుల ఫోటోలు ఉండకూడదని, కేవలం రైతులకు ఉపయోగపడే సూచనలు మాత్రమే ముద్రించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంట వెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కాగా, రైతులు దళారులకు ధాన్యం కట్టబెట్టి మోసపోకుండా, ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని మిల్లులకు ట్యాగింగ్ విదంగా ధాన్యం పంపాలని   మిల్లర్లు ఎక్కడ రైతులను ఇబ్బంది పెట్టోదని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, డి.ఎస్.ఓ మోహన్ బాబు, డి.ఆర్.డి.ఓ మధుసూదన్ రాజు, డి.సి.ఓ పద్మ,  డి.ఏ.ఓ శ్రీధర్ రెడ్డి, ఆర్.డి.ఓ లు సూర్యనారాయణ, వేణు మదవ్ , డి.ఎం.ఓ శర్మ,  ఆర్.టి.ఓ  సురేష్ రెడ్డి, డీఎస్ఓ  డీ.ఎం సి.ఎస్. రాములు, తహశీల్దార్లు, వివిధ మిల్లుల యజమాన్యులు, ఐకేపీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love