విస్తరిస్తున్న 5జీ నెట్‌వర్క్‌

– అద్భుత ఫలితాల ఆవిష్కరణ
– కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌చంద్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో అత్యంత వేగంగా 5జీ సేవలు విస్తరిస్తున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌చంద్‌ తెలిపారు. ఇప్పటి వరకు 5జీ సేవలు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు. బుధవారంనాడాయన గంగోత్రిలో రెండోలక్ష 5 జీ సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం 8 నెలల్లో 696 జిల్లాలను కవర్‌ చేసే 2 లక్షల సైట్‌లు ఇన్‌స్టాల్‌ అయ్యాయని తెలిపారు. అలాగే చార్‌ధామ్‌కు (బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి)కి ఫైబర్‌ కనెక్టివిటీని అంకితం చేస్తున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. చార్‌ధామ్‌లో ఇప్పుడు పూర్తిస్థాయి 5జీ ఫైబర్‌ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందన్నారు. దీనివల్ల చార్‌ధామ్‌ యాత్రామార్గంలో వాయిస్‌, వీడియో కాల్‌ నాణ్యత పెరుగుతుందని తెలిపారు. భారతదేశం 6జీ టెక్నాలజీలో వందకు పైగా పేటెంట్లను కలిగి ఉందన్నారు. అమెరికా వంటి అభివద్ధి చెందిన దేశాలు భారతీయ 4జీ, 5జీ టెక్నాలజీపై ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో టెలికాం సేవలను అత్యంత వేగంగా ఏర్పాటు చేయడంలో సహాకరించిన అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమలో పాల్గొన్న ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామ్‌ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో టెలికాం సేవలను ప్రారంభించేందుకు మద్దతు ఇచ్చినందుకు సర్వీస్‌ ప్రొవైడర్లకు ధన్యవాదాలు తెలిపారు. పర్వతాల్లో హై-స్పీడ్‌ నెట్‌వర్క్‌ వల్ల విపత్తు నిర్వహణ, నిఘా సులభతరమవుతాయని అన్నారు.

Spread the love