సీఎం కప్‌ టోర్నీని విజయవంతం చేయండి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీఎం కప్‌ టోర్నీ క్రీడలు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరుగుతున్నందున వాటి నిర్వహణా ఏర్పాట్లను జాగ్రత్తగా పూర్తి చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఇతర శాఖల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారంనాడాయన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అదనపు డైరెక్టర్‌ జనరల్‌ సంజరు కుమార్‌ జైన్‌, సిటీ పోలీస్‌ కమిషనర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమీషనర్‌ లోకేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అజరు కుమార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సి హరీష్‌, పర్యాటకశాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్‌, మెట్రో వాటర్‌ బోర్డ్‌ అధికారులు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రీడల్లో దాదాపు పదివేలకు పైగా క్రీడాకారులు హాజరుకానున్నందున తాగునీరు, పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ నెల 27 నుండి క్రీడాకారులు హైదరాబాద్‌కు వస్తున్నందున మొత్తం ఆరు స్టేడియాల పరిధిలో బందోబస్తు, నిరంతరాయ విద్యుత్‌ సౌకర్యం సమకూర్చాలని చెప్పారు. 29వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి కేటీఆర్‌ హాజరవుతారనీ, పలువురు మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మార్చ్‌ఫాస్ట్‌, ప్రముఖ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దాదాపు 200 బస్సులతో స్టేడియంకు చేరుకోనున్నందున ట్రాఫిక్‌ ఏర్పాట్లు పర్యవేక్షించాలని పోలీస్‌ అధికారులనుకోరారు. క్రీడాకారుల బస ప్రాంతాలలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు, ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి స్టేడియంకు ఒక ఇంచార్జిగా జిల్లా అధికారిని నియమించాలనీ, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లు క్రీడల నిర్వహణ విషయంలో నోడల్‌ అధికారులుగా వ్యవహరించాలని కోరారు. 3700పైగా బాలికలు, మహిళలు పాల్గొంటున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.

Spread the love