ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలపై రైతుల ఆగ్రహం

– క్వింటాకు 8 కిలోల తరుగును వ్యతిరేకిస్తూ రాస్తారోకో
– రైతులకు నచ్చజెప్పి విరమింపచేసిన ఎమ్మెల్యే పెద్ది
– ఎక్కువ తరుగు తీయొద్దని హెచ్చరిక
నవతెలంగాణ-నర్సంపేట
వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నెక్కొండ రోడ్డులోని ముగ్దుపురం గ్రామంలోని ధాన్యం కొనుగోళ్లలో క్వింటాకు 8 కిలోల తరుగు కింద కోతలు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేపట్టారు. రైస్‌ మిల్లర్లు కొర్రీలు పెట్టి దిగుమతి చేయడం లేదని కొనుగోలు కేంద్రం ఏజెన్సీల బాధ్యులు చెప్పారు. దాంతో రైతులు ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. రైతుల నిరసన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి.. సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే సెల్‌ఫోన్‌లో అధికారులు, రైస్‌మిల్లర్లతో మాట్లాడారు. క్వింటాకు 8 కిలోలు కోత విధించమేమిటని ప్రశ్నించారు. నిబంధనల మేరకు మాత్రమే తరగు తీయాలని ఆదేశించారు. రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అక్కడే ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు వెనువెంటనే చేపట్టి రైతులకు టోకెన్లు, గన్నీ బ్యాగులు వెంటనే ఇవ్వాలని కొనుగోలు కేంద్ర బాధ్యులను ఆదేశించారు. వాహనాల కొరత ఉన్నందున రైతులు వాహనాలను ఏర్పాటు చేసుకొని రైస్‌మిల్లులకు తరలించినట్లయితే నేరుగా రవాణ ఛార్జీలు చెల్లించడానికి అవకాశం ఉందన్నారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం చేసినా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Spread the love