ప్రజల్లో చైతన్య స్ఫూర్తి కలిగించిన నటుడు మాదాల రంగారావు

– సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె.నారాయణ
– సామాజిక, రాజకీయ పరిస్థితులపై సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
అభ్యుదయ, విప్లవ చిత్రాలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తి కలిగించిన నటుడు మాదాల రంగారావు అని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ తెలిపారు. ప్రజా కళాకారుడు, విప్లవ సినీ నటుడు, నిర్మాత, దర్శకులు, రెడ్‌ స్టార్‌ మాదాల రంగారావు 75వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్తులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి ఇప్టా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు ప్రముఖ సినీ నటుడు మాదాల రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ.. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అన్యాయం, దౌర్జన్యాలు, అణచివేత, రాజకీయ దుర్వినియోగాలను మాదాల రంగారావు 1980-90 దశకంలోనే సామాజిక విప్లవ సినిమాలతో తెరపై చూపించి సంచలనం సృష్టించారని చెప్పారు. మారుతున్న పరిస్థితుల్లో కూడా నమ్మిన సిద్ధాంతాలను తుదిశ్వాస వరకు విడవకుండా ఉన్న గొప్ప వ్యక్తి మాదాల రంగారావు అని కొనియాడారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. సామాజిక, రాజకీయ పరిస్థితులపై సినిమాలు తీసి మాదాల రంగారావు చరిత్ర సృష్టించారని చెప్పారు. అన్యాయాన్ని, అణచివేతను వెండితెరపై వర్ణించేందుకు రంగారావు ఎప్పుడూ ప్రయత్నించేవారని, రాజకీయాలు, సామాజిక అంశాల్లో చీకటి కోణాలను తన సినిమాల్లో చూపించేవారని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు భావజాలమే ఆయనలోని కళకు సానపెట్టిందని అభిప్రాయపడ్డారు. సినిమాల ద్వారా మాదాల రంగారావు సామాజిక మార్పునకు అలుపెరగని కృషి చేశారని చెప్పారు.
నటుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ.. మాదాల రంగారావు పేరు చెప్పగానే ఆయన నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన పలు విప్లవ చిత్రాలు గుర్తుకొస్తాయన్నారు. అధ్యక్షత వహించిన మాదాల రంగారావు తనయుడు మాదాల రవి మాట్లాడుతూ.. నాన్న తన కోసం కాకుండా ప్రజల కోసమే సినిమాలు తీశారనడంలో ఏ మాత్రం సందేహం లేదన్నారు. ఆయన తన తుది శ్వాసవరకు కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని కోరుకునేవారని, నేను కూడా నాన్నలాగే కమ్యూనిస్టులు ఐక్యంగా కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, అరుణోదయ విమలక్క, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి జి.రవి, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకుటు రాజేష్‌, ఇప్టా జాతీయ ప్యాట్రన్‌ సభ్యులు నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి, రచయిత డా.ఎస్వీ సత్యనారాయణ, ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్‌ తేజ, ప్రముఖ సినీ నిర్మాత పోకూరి బాబురావు, ప్రముఖ గాయకులు, సినీ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌, ప్రముఖ సినీ దర్శకులు మద్దినేని రమేష్‌, బాబ్జి, తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం చైర్మెన్‌ భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ పాల్గొన్నారు.

Spread the love