సీతారామ’ ముప్పు తప్పడంతో రైతుల సంబురం

– పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డికి సన్మానం
– జిల్లా నీటిపారుదల శాఖ అధికారులకు కూడా..
– హాజరైన ఆరు పంచాయతీల రైతాంగం
– సెప్టెంబరు 2024 నాటికి టన్నెల్‌ నిర్మాణం పూర్తి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీతారామ ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో కాల్వకు బదులుగా టన్నెల్‌ ఏర్పాటుకు కషి చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి కి భూ సేకరణ ముప్పు తప్పిన రైతులు బుధవారం సన్మానం చేశారు. తాళ్ళచెరువు క్రాస్‌ రోడ్‌ సమీపంలోని ప్రాజెక్టు బాధ్యతలు నిర్వహించే కంపెనీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని బీరోలు, తాళ్లచెరువు, మేడిదపల్లి, ఏలువారిగూడెం, పాతర్లపాడు, కూసుమంచి మండలం పోచారం తదితర గ్రామాలకు చెందిన సుమారు 300 మందికి పైగా రైతులు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తో పాటు ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన నీటి పారుదల శాఖ అధికారులు చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌ నాయక్‌, ఎస్‌ ఈ నర్సింగరావు, ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ బాణాల రమేష్‌ రెడ్డి, ఇతర ఇరిగేషన్‌ అధికారులను సైతం సన్మానించారు. సొరంగ మార్గంతో భూసేకరణ నుంచి విముక్తి పొందిన రైతులు ఏకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వంట వార్పుతో పండుగ వాతావరణం లో సన్మానోత్సవం నిర్వహించడం గమనార్హం. టన్నెల్‌ కు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. రైతుల భూములు మిగలడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. సొరంగ మార్గం ఏర్పాటుకు నీటిపారుదల శాఖ అధికారులు చూపించిన అంకిత భావాన్ని అభినందించారు.
546 ఎకరాలు మిగులు.. రూ.370 కోట్లు ఆదా
16వ ప్యాకేజీలో కాల్వకు బదులుగా సొరంగ మార్గం ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు 546 ఎకరాల భూములు మిగులుతున్నాయని ఇరిగేషన్‌ అధికారులు వెల్లడించారు. అలాగే ప్రభుత్వానికి రూ. 370 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు. 2024 సెప్టెంబర్‌ నాటికి ఈ టన్నెల్‌ పూర్తి చేయడానికి లక్ష్యంగా నిర్ధారించినట్లు చెప్పారు. భూసేకరణ తగ్గడం ద్వారా ప్రభుత్వానికి రూ 110 కోట్లు ఆదా అవుతాయని వెల్లడించారు. కాల్వ తీస్తే 14.2 కిలోమీటర్లు తీయాల్సి వచ్చేదని, టన్నెల్‌ 12.17 కిలోమీటర్లు తీస్తే సరిపోతుందని చెప్పారు. 38 యూటీల బదులు ఆరింటితో సరి పెట్టవచ్చు అన్నారు. ఇలా ఏరకంగా చూసినా అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి ఈ సొరంగ మార్గం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంగీలాల్‌, జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్‌, ఖమ్మం రూరల్‌ ఎంపీపీ బెల్లం ఉమా, బీఆర్‌ఎస్‌ మండల, రూరల్‌ మండలం అధ్యక్షులు వీరన్న, బెల్లం వేణు, బీరోలు, కొక్కిరేణి ఎంపీటీసిలు మాలతి, అంబేద్కర్‌, ఏలువారిగూడెం సర్పంచ్‌ దేవేందర్‌ రెడ్డి, రైతు నాయకులు బాలకృష్ణారెడ్డి, చావా వేణు, రావుల వెంకటరెడ్డి, కొప్పుల శ్రీనివాసరెడ్డి, అప్పయ్య, కమల్‌ హాసన్‌, వరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love