దక్షిణ కొరియాలో వరద బీభత్సం

– కొండచరియలు పడి 26 మంది మృతి..
సియోల్‌: భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతదేశం అతలాకుతలం అవుతుండగా.. ఇలాంటి భీకర పరిస్థితే దక్షిణ కొరియా కూడా ఎదుర్కొంటోంది. భారీ వర్షాలతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. వరదలు, కొండచరియలు విరిగిపడడంవల్ల 26 మంది మృతి చెందారు. మరో పదిమంది గల్లంతయ్యారు. మరెంతోమంది క్షతగాత్రులయ్యారు. దక్షిణ కొరియాలోని దక్షిణ ప్రాంతంలో నష్టం ఎక్కువగా సంభవించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 9 నుంచి దేశంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5,570 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా 25,470 ఇండ్లు చాలా రోజులుగా అంధకారంలో మునిగిపోయాయి. 4,200 మంది పునరావాస శిబిరాల్లో గడుపుతున్నారు. 20 విమాన సర్వీసులు రద్దు కాగా, బుల్లెట్‌ రైళ్లు సహా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా 200 రోడ్లను మూసివేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ తెలిపింది. జులై 9న ఒక్క రోజే చెయోంగ్యాంగ్‌లోని గోంగ్జులో ఏకంగా 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Spread the love