నిధులు నీళ్ల పాలు

Funds are milk of water– రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారు
– ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నారు
– మేడిగడ్డనే కాదు అన్నారంలోనూ లీకు
– చేసిన తప్పులను ఒప్పుకోవాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట నిధులను నీళ్లపాలు చేసిందనీ, నీళ్ల పేరుమీద ధనదాహం తీర్చుకున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. మేడిగడ్డనే కాదు ఇప్పుడు అన్నారం కూడా లీకవుతున్నదని చెప్పారు. కండ్లముందు వాస్తవాలు స్పష్టంగా కనబడుతున్నాయనీ, చేసిన తప్పులను ఒప్పుకోవాలని హరీశ్‌రావుకు సూచించారు. అలా చేయకుండా హరీశ్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శనివారం శాసనసభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగునీటిరంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం జరిగిన చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. కాళేశ్వరం వ్యయాన్ని ఎందుకు పెంచారని నిలదీశారు. 28 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం కట్టి 100 మీటర్ల నుంచి 500 మీటర్ల ఎత్తునకు ఎత్తిపోస్తున్నారని చెప్పారు. ఆ ప్రాజెక్టులో ఖర్చు పెంచారనీ, కమీషన్లు రాబట్టుకున్నారని ఆరోపించారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు కోసం రెండు లక్షల ఎకరాల భూమిని అప్పగించిన గత రాష్ట్ర పభుత్వం..ప్రాణహిత చేవెళ్ల కోసం కేంద్రాన్ని 3 వేల ఎకరాలను అడగలేకపోయిందా? అని ప్రశ్నించారు. మూడువేల ఎకరాల భూమిని రాబట్టుకోలేక 152 మీటర్ల ఎత్తు నుంచి 100 మీటర్లకు తరలించారని చెప్పారు. మోటార్లు ఎక్కడ నుంచి తెచ్చారని ప్రశ్నించారు. ఉత్తమ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను తప్పుబట్టడం సరిగాదన్నారు. నిట్టనిలువునా పిల్లర్లు చీలిపోయింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి కూడా మేడిగడ్డ లాగే ఉంటుందనీ, నీళ్లు ఎత్తిపోయొద్దని నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అధికారులు హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించారు. దీన్ని దేశమంతా చూస్తున్నదనీ, ఇంకా సమర్ధించుకోవాలని చూడటం అవివేకమే అవుతుందని చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణిహిత చేవెళ్ల సుజల స్రవంతి ద్వారా రూ.38 వేల కోట్లతో 16.5 లక్షల ఎకరాలకు నీళ్లను అందించే అవకాశముండేదన్నారు. దాని ద్వారా తెలంగాణలో ఏడు జిల్లాలకు సాగు, తాగు నీరు, హైదరాబాద్‌లోని పరిశ్రమల అవవసరాల కోసం నీళ్లు అందించే వెసులుబాటు ఉండేదని చెప్పారు. పైగా, మిషన్‌భగీరథ పథకం అవసరమే ఉండకపోయేదన్నారు. 2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై రూ.10 వేల కోట్లు ఖర్చుచేసిందనీ, ఆ తర్వాత వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్లతో ఎందుకు పని చేయించలేదని నిలదీశారు. రాజీవ్‌-ఇందిరా సాగర్‌ ప్రాజెక్టును పూర్తిచేస్తే 16 లోల ఎకరాలకు నీళ్లు అందేవని తెలిపారు. ఇలా రీడిజైన్ల పేరిట ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.1,72,000 కోట్ల రూపాయలకు పెంచారని విమర్శించారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు అందులో కొన్ని డబ్బులు కేటాయించినా పూర్తయ్యేవన్నారు. లక్షల కోట్ల అవినీతి రాష్ట్రంలో జరిగిందని కాగ్‌ తేల్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల శబరి నదిని కూడా కోల్పోయామని వాపోయారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నీటివనరులు ఏమైపోతే తమకేంటి డబ్బులొస్తే చాలు అన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహరించినట్టు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లు, ఇతర నిర్వహణ ఖర్చులకు మరో 25 వేల కోట్లు అవసరమవుతున్నాయని వివరించారు. అదే ప్రాణహిత చేవెళ్ల పూర్తయితే గ్రావిటీ ద్వారా నీళ్లను అందించే వెసులుబాటు ఉండేదన్నారు. గతంలో ఈపీసీ కింద కాంట్రాక్టులు అప్పగించేవారమనీ, ధరలు పెరిగినా, తగ్గినా సంబంధం లేకుండా కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేసి అప్పగించేవారని తెలిపారు. రాజీవ్‌ ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1400 కోట్ల నుంచి రూ.24 వేలకు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రాజెక్టులను చూపి రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని ఆరోపించారు.

Spread the love