పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు
నవతెలంగాణ-తుంగతుర్తి
ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పశువుల్లో వచ్చే సాధారణ రోగాలతో పాటు అంటు రోగాలకు, నట్టల నివారణ మందులను, పశుగ్రాసాలను వినియోగించుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక( రైతు వారోత్సవాలు మే 4 -9)లో భాగంగా వెంపటి గ్రామంలో స్థానిక సర్పంచ్ తప్పెట్ల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశువైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలోని రైతన్నల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యమని, పాడి పరిశ్రమను నమ్ముకున్న ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలుస్తూ, వారికి అవసరమైన నాణ్యమైన మేత, ఇతర వసతులను కల్పించేందుకు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ కృషి చేస్తుందన్నారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాల దిగుబడి పెరగడం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే మా సంకల్పం అన్నారు. మేలుజాతి దూడల ప్రదర్శన, పశుగ్రాస విత్తనాల పంపిణీ, వేసవిలో పశు సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో 43 గేదెలకు వైద్యం చేశారు. దూడల ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. 40 కేజీల పశుగ్రాస విత్తనాలను గ్రామంలోని అయిదుగురు రైతులకు సబ్సిడీలో అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మార్కెట్ డైరెక్టర్ సగ్గం నరసయ్య, తుంగతుర్తి ప్రాంతీయ పశు వైద్యాధికారి డాక్టర్ భయగాని రవి ప్రసాద్ గౌడ్, తుంగతుర్తి మండల పశువైద్యాధికారి డాక్టర్ నరేష్, వెంపటి పశు వైద్యాధికారి డాక్టర్ శరత్, ఎల్ ఎస్ ఏ రాజశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ రవి, ఏఈఓ జోత్స్నా, పంచాయతీ కార్యదర్శి వీరేందర్, గోపాలమిత్రలు లింగయ్య, శ్రీను, గ్రామ రైతులు వెంకన్న, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.



