ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌

– క్వాలిఫయర్‌2లో ముంబయి ఓటమి
– శుభ్‌మన్‌ గిల్‌ శతక తీన్‌మార్‌
– మోహిత్‌ శర్మ ఐదు వికెట్ల ప్రదర్శన

శుభ్‌మన్‌ గిల్‌ (129) శతక బీభత్సం సృష్టించగా, మోహిత్‌ శర్మ (5/10) ఐదు వికెట్ల ప్రదర్శనతో విరుచుకుపడగా గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండో సీజన్లో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. క్వాలిఫయర్‌2లో ముంబయి ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ 16 ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం టైటిల్‌ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌

శుభ్‌మన్‌ గిల్‌ (129, 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసక విశ్వరూపంతో సీజన్లో ఏకంగా మూడో సెంచరీ నమోదు చేశాడు. 49 బంతుల్లోనే శతకం సాధించిన శుభ్‌మన్‌ గిల్‌ క్వాలిఫయర్‌ 2లో టైటాన్స్‌కు ఘన విజయాన్ని అందించాడు. సాయి సుదర్శన్‌ (43, 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్య (28 నాటౌట్‌, 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా తొలుత గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగుల భారీ స్కోరు చేసింది. 234 పరుగుల రికార్డు ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ చతికిల పడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (61, 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ(43, 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ మెరుపులతో కదం తొక్కినా.. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (8), నేహల్‌ వధేరా (4), విష్ణు వినోద్‌ (5), టిమ్‌ డెవిడ్‌ (2) విఫలమయ్యారు. కామెరూన్‌ గ్రీన్‌ (30, 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుస శతకాల జోరు చూపించలేకపోయాడు. టైటాన్స్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ (5/10) ఐదు వికెట్ల ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్‌ను దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో రెండేసి వికెట్లు పడగొట్టిన మోహిత్‌ శర్మ.. ముంబయి ఇండియన్స్‌ ఆశలు ఆవిరి చేశాడు. మహ్మద్‌ షమి (2/41), రషీద్‌ ఖాన్‌ (2/33) రాణించారు. 18.2 ఓవర్లలో 171 పరుగులకు ముంబయి ఇండియన్స్‌ కుప్పకూలింది. 62 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ భారీ విజయం సాధించింది. శుభ్‌మన్‌ గిల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
శుభ్‌మన్‌ షో : వర్షం అంతరాయంతో క్వాలిఫయర్‌2 పోరు 30 నిమిషాలు ఆలస్యమైంది. పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకునే ఆలోచనలో ముంబయి ఇండియన్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. శుభ్‌మన్‌ గిల్‌, వృద్దిమాన్‌ సాహా (18తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. వ్యక్తిగత స్కోరు 30 వద్ద జోర్డాన్‌ బౌలింగ్‌లో టిమ్‌ డెవిడ్‌ క్యాచ్‌ నేల పాలు చేయటంతో గిల్‌ జీవనదానం పొందాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన గిల్‌.. అసలు విశ్వరూపం పది ఓవర్ల తర్వాతే చూపించాడు. 10 ఓవర్లలో 91/1తో ఉన్న టైటాన్స్‌.. గిల్‌ మెరుపులతో చివరి పది ఓవర్లలో ఏకంగా 145 పరుగులు పిండుకుంది. ముంబయి ప్రధాన బౌలర్లు పియూశ్‌ చావ్లా, ఆకాశ్‌ మధ్వాల్‌, క్రిస్‌ జోర్డాన్‌లను టార్గెట్‌ చేసిన గిల్‌ బౌండరీలతో రెచ్చిపోయాడు. నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 49 బంతుల్లోనే 100 పరుగులు చేసిన గిల్‌.. ఈ సీజన్లో ముచ్చటగా మూడో శతకం చేశాడు. మరో ఎండ్‌లో స్ట్రయిక్‌ రొటేషన్‌కు పరిమితమైన సాయి సుదర్శన్‌ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. రెండో వికెట్‌కు గిల్‌, సాయి జోడీ 138 పరుగులు జోడించింది. చివర్లో హార్దిక్‌ పాండ్య (28), రషీద్‌ ఖాన్‌ (5) మెరుపు ముగింపు అందించారు.

Spread the love