కమీషన్‌ ఇవ్వలేదని రోడ్డు తవ్వేశాడు

Commission is not given He dug the road– యూపీలో బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడి నిర్వాకం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ప్రజా పనుల శాఖ వేసిన అర కిలోమీటరు రోడ్డును బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడొకడు బుల్‌డోజర్లతో నామరూపాలు లేకుండా తవ్వించేశాడు. షాజహాన్‌పూర్‌- బుదౌన్‌లను కలిపే ఈ రోడ్డును కత్రా బీజేపీ ఎమ్మెల్యే వీర్‌ విక్రమ్‌ సింగ్‌ అనుచరుడు 15-20 మంది గుర్తు తెలియని వ్యక్తులు, బుల్‌డోజర్లతో వచ్చి ధ్వంసం చేశాడంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇంతకీ ఆ రోడ్డుపై ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసా? రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌ ‘ఆమ్యామ్యా’ సమర్పించలేదట. ఎమ్మెల్యే అనుచరుడి నిర్వాకంపై రోడ్డు నిర్మాణ కంపెనీ మేనేజర్‌ రమేష్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా నిరోధించే చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ప్రతినిధినని చెప్పుకుంటున్న జగ్‌వీర్‌ సింగ్‌ సదరు నిర్మాణ కంపెనీ సిబ్బందిని గతంలో అనేకసార్లు బెదిరించాడు. తనకు ఐదు శాతం కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. కంపెనీ ఇందుకు అంగీకరించకపోవడంతో అర కిలోమీటరు మేర వేసిన రోడ్డును ఈ నెల 2న బుల్‌డోజర్లతో తవ్వించాడు. నవాడా మీదుగా జైతిపూర్‌ నుండి బుదౌన్‌ జిల్లాకు ఈ రోడ్డును నిర్మించారు. జగ్‌వీర్‌ సింగ్‌ 15-20 మంది మనుషులను తీసుకొని రోడ్డు నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చాడని, కర్రలతో కంపెనీ కార్మికులపై దాడి చేసి కొట్టారని, ఆ తర్వాత రోడ్డును తవ్వించారని ఫిర్యాదులో తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్‌ సూపరింటెండెంట్‌ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను పూర్తి సమాచారం అడిగామని, దీనిపై విచారణ జరిపేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌ సంజరు కుమార్‌ పాండే తెలిపారు. నివేదిక అందిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూ రోడ్డు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, కార్మికులకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించామని చెప్పారు. కాగా నిందితుడు తన సహచరుడు కాదని చెబుతూనే అతను బీజేపీ కార్యకర్తేనని ఎమ్మెల్యే అంగీకరించారు.

Spread the love