భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయమందించండి

– ఎస్పీలకు డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అందుబాటులో ఉండి తగిన సహాయ సహకారాలను అందించాలని పోలీసు అధికారులను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశించారు. శుక్రవారం అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జలమయం అయ్యాయనీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో వర్షప్రభావిత ప్రాంతాల పోలీసు అధికారులు స్థానిక ముంపు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాలపై తగిన సూచనలు, జాగ్రత్తలను ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు అందించి వారు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు భారీ వర్షాల కారణంగా రోడ్లు తెగిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయనీ, ఆ ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ సహాయపడాలని సూచించారు. భారీ వర్షాలు ముగిసే వరకూ ఉన్నతాధికారులెవ్వరు కూడా హెడ్‌క్వార్టర్లను వదలరాదని ఆదేశించారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో, గోదావరి ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా బాధిత ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించడానికి రెవెన్యూ అధికారులకు సహకరించాలని సూచించారు. కాగా, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి అధికారులకు తగిన సూచనలిస్తున్నట్టు రీజియన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

Spread the love