ఓసారి కరెంటు తీగలు పట్టుకోండి..

– విద్యుత్‌ ఉందో లేదో తెలుస్తుంది…
– కాంగ్రెస్‌ నేతలనుద్దేశించి మంత్రి హరీశ్‌ ఎద్దేవా
– వారు అధికారంలోకి వస్తే పాత
– పాలనే తెస్తారంటూ విమర్శ
– కరెంటు నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందంటూ వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్‌ ఎక్కడుందంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నేతలు… ఒకసారి కరెంటు తీగలు పట్టుకుని చూడాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చురకలం టించారు. అప్పుడు కరెంటు ఉందో లేదో తెలుస్తుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి వారు కుడితలో పడ్డ ఎలుకల్లాగా తలోమాటా మాట్లాడుతు న్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ… వ్యవసా యానికి మూడు గంటల కరెంటు చాలంటూ చెప్పటం ద్వారా ఉచిత విద్యుత్‌ అంశాన్ని పక్కదారి పట్టించేం దుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం నాలుగైదు గంటల కరెంటే వచ్చేదని గుర్తు చేశారు. వారికి ఏడు గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేయలేమంటూ ఆనాటి కాంగ్రెస్‌ సీఎంలు అధికారికంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు పదే పదే ఉచిత విద్యుత్‌ గురించి మాట్లాడటం, మూడు గంటలపాటే కరెంటు చాలంటూ చెప్పటం ద్వారా తాము అధికారంలోకి వస్తే తిరిగి పాత పాలనను తెస్తామనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
బషీర్‌బాగ్‌ కాల్పులకు కేసీఆరే కారణమంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ చెప్పటాన్ని హరీశ్‌రావు పెద్ద జోక్‌గా అభివర్ణించారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే కరెంటు సమస్యలనుంచని తెలిపారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలంటూ ఆనాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌… చంద్రబాబుకు లేఖ రాశారని తెలిపారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతున్న క్రమంలో మొట్టమొదటగా స్పందించింది కేసీఆరేనని చెప్పారు. ఆయన ఆనాడు తన పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నారని తెలిపారు. కానీ ఇప్పుడు కొంతమంది నేతలు పదవుల కోసం పార్టీలు మారుతున్నారంటూ కాంగ్రెస్‌ నాయకులనుద్దేశించి విమర్శించారు. బీజేపీ విధానం మతం పేరిట మంటలు.. కాంగ్రెస్‌ విధానం మూడు గంటలు..
కేసీఆర్‌ విధానం మాత్రం మూడు పంటలంటూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ ప్రజలకు సూచించారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా 24 గంటల ఉచిత కరెంటును ఇవ్వటం లేదని గుర్తు చేశారు. 2004లో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తామంటూ చెప్పటం ద్వారా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అదే పార్టీకి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం హోదాలో రైతులకు ఏడు గంటలపాటు కూడా కరెంటు ఇవ్వలేమంటూ తేల్చి చెప్పారని ఎద్దేవా చేశారు. ఆనాడు క్రాప్‌ హాలిడేలిచ్చారనీ, పరిశ్రమలకు కరెంటు కోతలు విధించారని విమర్శించారు. అలాంటి పరిస్థితులనుంచి తెలంగాణ బయటపడిందన్నారు. రాష్ట్రం సిద్ధించాక అసెంబ్లీలో కరెంటు కోతల గురించి, ఎండిన పంటల గురించి చర్చించాల్సిన అవసమరమే లేకుండా పోయిందని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంటు పరిస్థితేంటి..? బీఆర్‌ఎస్‌ ఏలుబడిలో విద్యుత్‌ పరిస్థితేంటి..? అనే అంశంపై వచ్చే ఎన్నికల సందర్భంగా ప్రజల నుంచి రెఫరెండం కోరదామా..? అని సవాల్‌ విసిరారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ (బీజేపీ) ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయ పంపు సెట్లకు డీజిల్‌ ఇంజిన్లు ఉన్నాయంటూ గుర్తు చేశారు. అందుకు భిన్నంగా తెలంగాణలో విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామనీ, అందుకోసం రూ.37 వేల కోట్లను ఖర్చు చేశామని వివరించారు. ఉచిత విద్యుత్‌ వద్దంటూ చెప్పిన చంద్రబాబును గతంలో ప్రజలు ఇంటికి సాగనంపారని తెలిపారు. రైతుల్ని కష్టాలపాల్జేసిన కాంగ్రెస్‌కు కరెంటు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు.
ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ విధానాలపై మాట్లాడిన తమ పార్టీ నాయకుడు దాసోజు శ్రావణ్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే ఎమ్మెల్యే రాజాసింగ్‌ తనను కలిశారని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Spread the love