ఎవరి బలం ఎంత?

– ప్రభుత్వానికి అనుకూలం 356
– వ్యతిరేకం 153, తటస్థం 28
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో గెలుపు పాలకపక్షానిదే అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభలో బలాబలాలను బట్టి ప్రభుత్వానికి మద్దతుగా 356 మంది, వ్యతిరేకంగా153 మంది ఉండగా 28 మంది తటస్థంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల బలాబలాలను పరిశీలిస్తే…
మోడీకి బాసటగా…
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లోక్‌సభలో 356 మంది సభ్యుల (స్పీకర్‌తో కలిపి) మద్దతు ఉంది. బీజేపీకి సొంతంగా 301 మంది సభ్యులు ఉన్నారు. భాగస్వామ్య పక్షాలైన శివసేన (షిండే)కు 13, రాష్ట్రీయ లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ)కి 5, అప్నాదళ్‌ సోనీలాల్‌ (ఏడీఎస్‌)కి ఇద్దరు సభ్యులు ఉండగా లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (అజిత్‌ పవార్‌), అల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ), నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ), నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం), మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) పార్టీలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. స్వతంత్ర సభ్యులు సుమలత, నవనీత్‌ కౌర్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. వైసీపీకి 22 మంది, టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
విపక్ష కూటమిలో…
కొత్తగా 26 పార్టీలతో ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు 142 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్‌కు 50 మంది ఎంపీలు ఉన్నారు. డీఎంకేకు 24, టీఎంసీకి 23, జేడీయూకి 16, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే)కు 6, ఎన్సీపీ (శరద్‌ పవార్‌)కి 4, సీపీఐ (ఎం)కు 3, ఎస్పీకి 3, ఐయూఎంఎల్‌కి 3, జేకేఎన్‌సీకి 3, సీపీఐకి ఇద్దరు సభ్యులు ఉండగా ఆప్‌, జేఎంఎం, ఆర్‌ఎస్పీ, వీసీకే, కేరళ కాంగ్రెస్‌ (మణి) పార్టీలకు ఒక్కో ఎంపీ ఉన్నారు. అయితే కూటమిలో లేని బీఆర్‌ఎస్‌ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చింది. ఆ పార్టీకి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. అలాగే ఎంఐఎంకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
తటస్థంగా 28 మంది…
తీర్మానంపై తటస్థంగా ఉన్న పార్టీలకు 28 మంది ఎంపీలు ఉన్నారు. బీజేడీలో 12 మంది, బీఎస్పీలో 9, శిరోమణి అకాలీ దళ్‌ (సాద్‌)లో ఇద్దరు సభ్యులు ఉండగా జేడీఎస్‌, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్పీ), ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎఐయూడీఎఫ్‌), శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) పార్టీలకు చెందిన ఒక్కో సభ్యుడు, స్వతంత్ర అభ్యర్థి హీరా శరణ్య తటస్థంగా ఉన్నారు.
ఐదు స్థానాలు ఖాళీ
లోక్‌సభలో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో ఇటీవల అనర్హత వేటు పడిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్థానం కూడా ఒకటి. ఘాజీపూర్‌, చంద్రాపూర్‌, పూణే, అంబాలా, వయనాడ్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Spread the love