బజాజ్‌ ఆటోలో ఎల్‌ఐసీ వాటాల విక్రయం

– ఓపెన్‌ మార్కెట్‌లో 2% ఈక్విటీల అమ్మకం
ముంబయి : దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఒపెన్‌ మార్కెట్‌లో బజాజ్‌ ఆటోలో రెండు శాతం వాటాలను విక్రయించింది. బజాజ్‌ ఆటో లిమిటెడ్‌లోని తమ 147,12,999 షేర్ల నుంచి 89,77,945 ఈక్విటీ షేర్లకు తగ్గించుకున్నట్టు తెలిపింది. దీంతో పెయిడ్‌ అప్‌ కాపిటల్‌లోని వాటాలు 5.2 శాతం నుంచి 3.17 శాతానికి తగ్గాయని ఎల్‌ఐసీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ షేర్‌ ఒక్కంటిని సగటున రూ.4,772.18కు విక్రయించింది. 2022 నవంబర్‌ 16 నుంచి 2023 జులై 25 మధ్య కాలంలో ఓపెన్‌ మార్కెట్‌లో షేర్లను అమ్మేసింది. దీంతో 5.2 శాతం నుంచి 3.17 శాతానికి తగ్గడంతో దాదాపు 2.07 శాతం వాటాలను విక్రయించినట్లయ్యింది.
బజాజ్‌ ఆటో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీలో ఉంది. దాదాపుగా 79 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇంతక్రితం మేలో హెచ్‌పీసీఎల్‌లో ఎల్‌ఐసీ తన వాటాలను 4.901 శాతం నుంచి 5,013 శాతానికి పెంచుకుంది. గడిచిన జూన్‌ మాసంలో ఎల్‌ఐసీ నూతన ప్రీమియం వ్యాపారం వసూళ్లు 21 శాతం పెరిగి రూ.24,970.82 కోట్లుగా నమోదయ్యింది. ఇదే సమయంలో ప్రయివేటు బీమా కంపెనీల వ్యాపారం 13 శాతం పెరిగి రూ.11,990.94 కోట్లుగా చోటు చేసుకుంది. బుధవారం బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేర్‌ విలువ 0.84 శాతం పెరిగి రూ.628.50 వద్ద ముగిసింది.

Spread the love