చైనాలో భారీ భూకంపం… 6వేలకు పైగా ఇండ్లు ధ్వంసం..

నవతెలంగాణ చైనా: చైనా(China)లో సంభవించిన భారీ భూకంపం(Earthquake) తీవ్రత విషాదాన్ని మిగిల్చింది. భూకంపం దాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలోని వాయువ్య గన్సు, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం దాటికి సుమారు 116 మందికిపైగా మృతి చెందారు. 400 మందికిపైగానే గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వెంటనే రంగంలోకి దిగిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) అధికారులను అప్రమత్తం చేశారు. భూకంపం కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) అధికారులను ఆదేశించారు. తక్షణ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, గాయపడినవారికి తక్షణమే చికిత్స అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. భూకంపం ప్రభావంతో సంభవించే మార్పుల వల్ల పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలన్నారు.
రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపై పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఇప్పటి వరకు 6,381 ఇళ్లు నేలమట్టం అయినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎల్లో రివర్‌పై వంతెన బీటలువారింది.
నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కింగ్‌హై ప్రావిన్స్‌.. టిబెట్‌కు సమీపంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. కింగ్‌హై పక్కన ఉండే గ్జిన్జియాంగ్ ఉయ్‌గుర్‌లో మంగళవాం మరోసారి భూమి కంపించింది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు సహాయచర్యలు ముమ్మరం చేశాయి.

Spread the love