అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాను.. సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట: నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల ప్రజలకు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారని కాంగ్రెస్ అభ్యర్థి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం మండలంలోనీ  మచ్చాపూర్ గ్రామం నుండి పస్రా గ్రామం వరకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం సందర్భముగా భారీ బైక్ ర్యాలీలో సీతక్క పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు గతంలో మాదిరిగానే అందిస్తామని అన్నారు. సాగు చేసుకునే ప్రతి రైతుకు పట్టా బుక్కులు అందించి అండగా నిలబడతాం గిరిజన, గిరుజనేతరులు అందరూ నా సహోదరులు నాకు రెండు కళ్ళ లాంటి వారు.ఎవరి భూములు గుంజుకున్న చరిత్ర సీతక్కకు లేదు. కావాలని కొందరు అధికార పార్టీ నేతలు నా మీద దుస్ప్రచారం చేస్తున్నారని అని, దమ్ముంటే నిరూపించాలని సీతక్క సవాల్ చేశారు.కర్లపల్లి, మేడారం, గోవిందరావుపేటలో భూములు గుంజుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌కి ఉందని, కాంగ్రెస్ పార్టీ కానీ, నేను భూములు గుంజుకున్నా చరిత్ర లేదన్నారు.
 గిరిజన, గిరిజనేతరులు అందరూ నా తోడబుట్టిన వాళ్ళే అని, ఒక ఆడబిడ్డగా ఎవరికి నేను అన్యాయం చేయను అని, అన్ని వర్గాల ప్రజలకు పట్టా పాస్ బుక్కులు అందిస్తాం అని అన్నారు. మచ్చాపూర్ గ్రామం పోరాటాల గడ్డ అని, వాళ్లకు ఉన్న అతి పెద్ద సమస్య భూదాన్ పట్టాలు అని, కాంగ్రెస్  అధికారంలోకి రాగానే వారి సమస్యను పరిష్కరించి మచ్చాపూర్ ప్రజలందరికి పట్టాలు అందిస్తాను అని అన్నారు. అలాగే మచ్చాపూర్ గ్రామం నుండి కాంగ్రెస్ లోకి వచ్చినవారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే చల్వాయి గ్రామంలోని వడ్డెర కుల సంఘం నాయకులతో మాట్లాడిన సీతక్క గారు వారికి కుల సంఘ భవనం నిర్మిస్తా అని, అలాగే చల్వాయి గ్రామంలో భూములు కోల్పోయిన వారికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికి నష్ట పరిహారం అందిస్తాం అని, లేకపోతే భూమి కోల్పోయిన వారికి భూములు అందజేస్తాం అని అన్నారు. అలాగే పస్ర గ్రామంలోని పాతూరు గ్రామంలో ఉన్న ప్రజలను కలిసి వారికి కాంగ్రెస్  రాగానే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్లస్థలాలు అందించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ కూడా చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న అని అన్నారు. అలాగే అన్ని కులాలు, వర్గాలు సమానమే అని, ఏ ఒక్క వర్గానికి మద్దతు ఇచ్చే వ్యక్తిని కానని, సాగు చేసుకునే ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తాం అని అన్నారు. పోడు భూములకు కూడా పట్టాలు అందిస్తాం అని అన్నారు. కెసిఆర్ గారు ధరణి పోర్టల్ తీసుకువచ్చి ప్రభుత్వ భూముల్ని దోచుకున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లతో దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్ కట్టినం అని గొప్పలు చెప్పుకున్న కెసిఆర్  నాణ్యత ప్రమాణాలు లోపించి మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్ బీటలు వారడం కల్వకుంట్ల వారి అవినీతికి ప్రతీక అని అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి మన తలాపున ఉన్న గోదావరి నీళ్లను తరలించడానికి కట్టిన ప్రాజెక్ట్ కూడా నాణ్యతతో కట్టకుండా లక్ష కోట్ల రూపాయలు దోచుకుపోయారని అన్నారు. మన బ్రతుకులు మారుతాయి అని, మన కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇస్తే మన రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుని మనల్ని మోసం చేసిందని అన్నారు. ఇకనైనా మోస పూరిత వాగ్ధానాలు చేసే నాయకుల్ని నమ్మవద్దని, ఈ దేశ స్వాతంత్య్రం కోసం పుట్టిన కాంగ్రెస్ ని, తెలంగాణ స్వరాష్ట్ర కలను తీర్చిన కాంగ్రెస్  ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలయ్యే పథకాలు.. రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్, 2 లక్షల రైతు రుణమాఫి, ప్రతి ఏటా పట్టాదారులకు 15000/- రూపాయలు, కౌలు రైతులకు 12000/- రూపాయలు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని అన్నారు.  గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు అందిస్తామని అన్నారు. చేయూత పథకం ద్వారా వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 4000/- రూపాయల పెన్షన్ అందిస్తామని అన్నారు.  యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఫీజ్ రీ ఇంబర్శుమెంట్ అందించి పేద విద్యార్థులందరికీ ఉచిత ఉన్నత విద్యను అందించి 5 లక్షల రూపాయల వరకు విద్యార్థులకు అందిస్తామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఏటా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు.
ఈ ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అసలు బీఆర్‌ఎస్‌ పేదల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారా లేక పార్టీ కోసం ఇచ్చారో అర్థం కావట్లేదని, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు పంచడం దారుణం అని అన్నారు. నియంత పాలనను అంతమొందించి పేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అలాగే గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు లబ్ధిదారుల ఎంపికలో బీఆర్‌ఎస్‌ వారి కార్యకర్తలను ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలను, పార్టీ పథకాలుగా మార్చి పేదల అభివృద్ధికి అడ్డుపడ్డారు అని అన్నారు. అలాగే కాంగ్రెస్  అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేసి సాగు చేసే ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.
Spread the love