– ఈ ఏడాది వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కూడా
– అన్ని జిల్లాలూ వాటికే అప్పగింత
– అడుగుజాడల్లో రాష్ట్ర సర్కార్
అమరావతి : గతేడాది ఖరీఫ్‌లో విపత్తులతో పంటలు నష్టపో యిన రైతులను ప్రైవేటు బీమా కంపెనీలు నిలువునా ముంచిన అనుభవం ఉండగానే, ప్రభుత్వం ఈ సంవత్సరం మరింతగా ప్రైవేటు కంపెనీలను ప్రవేశపెట్టింది. నిరుడు కేవలం దిగుబడి ఆధారిత బీమాలోకే (ఫసల్) కొన్ని ప్రైవేటు సంస్థలు రాగా ఈ తడవ వాతావరణ ఆధారిత బీమాను కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. ఫసల్‌లో కొన్నే ప్రైవేటు కంపెనీలుండగా వాతావరణ బీమా మొత్తాన్నీ ప్రైవేటు కంపెనీలు చేజిక్కించుకు న్నాయి.
2023-24 ఖరీఫ్, రబీలో పంటల బీమా అమలు కోసం ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని జిల్లాలను క్లస్టర్ల వారీగా విభ జించి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలను గ్లోబల్ టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. బీమా వర్తించే పంటలనూ నోటిఫై చేసింది. ఈ విషయాలపై ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. పంటల నోటిఫికేషన్ల ను, జిఓలను అంతర్గతంగా జిల్లా వ్యవసాయాధి కారులకు (డిఎఒ) ఇప్పుడిప్పుడే వాట్సాప్‌ల్లో పంపుతోంది.
కేంద్రం ఒత్తిడితోనే
కేంద్ర పంటల బీమా పథకం ఫసల్ వలన ప్రైవేటు కంపెనీలు లాభపడుతున్నాయని, రైతులకు సకాలంలో క్లెయిములు అందక నష్టం జరుగుతోందని వైసిపి సర్కారు వచ్చాక తానే స్వయంగా బీమా పథకాలు అమలు చేసింది. కేంద్రం తన వాటా నిధులు బిగబట్టి, తమ పథకాల్లో చేరాలని ఒత్తిడి చేయడంతో నిరుటి నుంచి కేంద్ర పథకాల్లో చేరింది. ఫసల్‌లో గతేడాది కంపెనీలను ఆహ్వానించింది. వాతావరణ బీమాను అంతకుముందు మల్లే తానే అమలు చేసింది. ఈ సంవత్సరం వాతావరణ ఆధారిత బీమాను సైతం కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లి అక్కడా కంపెనీలను ప్రవేశపెట్టింది.
అధిక ప్రీమియం
ఫసల్‌లోకి ఈ తడవ బజాజ్ ఎలియాంజ్ రెండు క్లస్టర్లకు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఒక క్లస్టర్‌కు ఎంపికయ్యాయి. ప్రభుత్వరంగ సంస్థలైన ఎస్‌బిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కొన్ని క్లస్టర్లకు ఎంపికయ్యాయి. నిరుడు కేంద్ర వ్యవసాయశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ ఎఐసి ఐదు జిల్లాలకు ఎంపిక కాగా ఈ మారు ఆ కంపెనీ లేదు. ఈ ఏడాది నుంచి కేంద్ర పథకంలో చేరిన వాతావరణ బీమాలో ఒక్క ప్రభుత్వరంగ సంస్థ కూడా లేదు.
అన్నీ ప్రైవేటు కంపెనీలనే ఎంపిక చేశారు. ప్రైవేటు కంపెనీలు కోట్ చేసిన ప్రీమియం రేటు చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు తక్కువ ప్రీమియం కోట్ చేయగా, అత్యధికంగా 12.56 శాతం సగటు ప్రీమియం రేటును ప్రైవేటు సంస్థలు కోట్ చేసి పోటీలో నిలిచాయి.
ఖరీఫ్‌లో సాధారణ వ్యవసాయ పంటలకు రైతు చెల్లించాల్సిన ప్రీమియం 2 శాతం, రబీలో 1.5 శాతం. రెండు సీజన్లలోనూ హార్టికల్చర్ పంటలకు 5 శాతం. రైతు వాటా పోను ప్రీమియంలో మిగతా భాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. మన రాష్ట్రంలో ఉచిత పంటల బీమా కావడంతో రైతు వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఏతావాతా ప్రైవేటు కంపెనీలు కోట్ చేసే మొత్తాన్నీ ప్రభుత్వాలే కట్టాలి. ఎక్కువ ప్రీమియానికి ఏజెన్సీలను ఎంపిక చేస్తే ఆ భారం ప్రభుత్వాలపై, అంతిమంగా ప్రజలపై పడుతుంది. కంపెనీలు గరిష్ట లాభాలు పోగేసుకుంటాయి.
రబీ పరిహారం ఇంకా లేదు
2022-23 రబీలో విపత్తులకు పంటలు నష్టపోయాయి. ఇప్పటి వరకు బీమా పరిష్కారం కాలేదు. నిరుడు ఖరీఫ్‌లో ప్రైవేటు కంపెనీలు దిగుబడి ఆధారిత బీమాను అమలు చేయగా రైతుల తరఫున ప్రభుత్వాల నుంచి రూ.1,882 కోట్ల ప్రీమియం వసూలు చేసి, రూ.572 కోట్ల పరిహారం చెల్లించడానికి ముందుకొచ్చాయి. ఇంకా రైతులకు పరిహారం పూర్తిగా చేరలేదు.
రూ.1,310 కోట్లు మిగుల్చుకోగా అందులో ప్రైవేటు వాటా రూ.780 కోట్లు. గుంటూరు, అన్నమయ్య, విశాఖ జిల్లాల్లో సున్నా క్లెయిములు నమోదయ్యాయి. ఇక్కడ ప్రైవేటు కంపెనీలే నిర్వహించాయి. రైతులు ప్రైవేటు సంస్థలొద్దంటున్నా రాష్ట్ర సర్కారు కేంద్ర పథకాల్లో చేరి క్రాప్ ఇన్సూరెన్స్ వ్యవస్థను మరింతగా ప్రైవేటీకరిస్తోంది.