పెరుగుతున్న హృద్రోగ మరణాలు

ప్రపంచ ఆరోగ్య సమాఖ్య నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచంలో గుండె జబ్బులతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య తన తాజా నివేదికలో తెలిపింది. గుండె నాళాలకు సంబంధించిన వ్యాధుల (సీవీడీ) కారణంగా 1990లో 1.21 కోట్ల మంది చనిపోతే 2021 నాటికి ఆ సంఖ్య 2.05 కోట్లకు పెరిగిందని ఆ నివేదిక వివరించింది. ఈ తరహా మరణాలకు అధిక రక్తపోటు, వాయు కాలుష్యం, పొగాకు వినియోగం, చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వంటివి ప్రధాన కారణాలు. సీవీడీ వంటి సంక్రమణ యేతర వ్యాధుల (ఎన్‌సీడీ) కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను 2025 నాటికి 25% తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం ప్రపంచ దేశాలకు కష్టమవుతోంది. మన దేశంలో ఎన్‌సీడీలు ప్రజారోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ఎన్‌సీడీ మరణాలు కనీసం 63% పెరిగాయని ప్రభుత్వ నివేదిక తెలిపింది. ‘దేశంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. అయితే ఇంతకంటే మరింత ఆందోళన కలిగించే విషయమేమంటే ప్రజలు చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం, ఊబకాయం, పొగతాగడం, మద్యం వినియోగం వంటివన్నీ ప్రాణాలకు ముప్పు కలిగించేవేనని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్‌ వీకే బాహల్‌ తెలిపారు. ప్రజల ఆదాయం తక్కువగా లేదా ఓ మోస్తరుగా ఉన్న దేశాలలో గుండె జబ్బులు తీవ్రమైన ముప్పుగా పరిణమించాయని నివేదిక స్పష్టం చేసింది. గుండె జబ్బులలో 80% వ్యాధులను ముందుగానే నివారించవచ్చునని, అయితే ఇందుకు ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించి ప్రజలకు రక్షణ కల్పించాలని నివేదిక సహ రచయిత ఫాస్టో పింటో తెలిపారు. కాగా ఆరోగ్యంపై ప్రభుత్వాలు తమ వ్యయాన్ని మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీడీపీలో ఆరోగ్య రక్షణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేసే దేశాలలో గుండె సంబంధమైన వ్యాధుల కారణంగా జరిగే మరణాలు తక్కువగా ఉంటున్నాయని వారు గుర్తు చేశారు. మన దేశం జీడీపీలో 2.9 శాతాన్ని ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తోంది. ఈ వ్యయం కనీసం ఐదు శాతమైనా ఉండాలని పౌర సమాజం కోరుతోంది. తగిన చర్యలు చేపడితే 2030 నాటికి గుండె జబ్బుల మరణాల సంఖ్యను మూడో వంతు తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

Spread the love