కొనసాగుతున్న ఎఫ్‌టీఐఐ విద్యార్థుల నిరాహారదీక్ష

– ఆరో రోజుకు చేరిన నిరసన
న్యూఢిల్లీ : ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) విద్యార్థులు చేస్తున్న నిరాహార దీక్ష ఇంకా కొనసాగుతున్నది. నలుగురు విద్యార్థులు చేస్తున్న ఈ దీక్ష ఆరో రోజుకు చేరుకున్నది. 2020 బ్యాచ్‌ నుంచి విద్యార్థిని బహిష్కరించి, తదుపరి బ్యాచ్‌లో అడ్మిషన్‌ను నిరాకరిస్తూ అకడమిక్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నలుగురు విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
బహిష్కరణకు సంబంధించిన ఫిర్యాదులు, బాధిత విద్యార్థి మానసిక ఆరోగ్య సమస్యలపై తగిన శ్రద్ధ చూపకపోవడాన్ని పేర్కొంటూ ఎఫ్‌టీఐఐ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ సమ్మెకు నాయకత్వం వహిస్తున్నది. ఎఫ్‌టీఐఐ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ప్రకారం.. 2020 బ్యాచ్‌ నుంచి ఐదుగురు విద్యార్థులను ముందస్తు నోటీసు లేకుండా బహిష్కరించారు. అయితే మే 1న జరిగిన అత్యవసర అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని అనుసరించి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్దేశిత రెమెడియల్‌ అసైన్‌మెంట్‌లు, వ్యాయామాలను పూర్తి చేయాలనే షరతుపై నలుగురు విద్యార్థులు తరగతులకు హాజరు కావడానికి అనుమతించబడ్డారు. అయితే, ఒక విద్యార్థి రెండో సెమిస్టర్‌ని సూపర్‌న్యూమరీ విద్యార్థిగా పునరావతం చేయడానికి అవసరమైన ప్రమాణాలను చేరుకోలేకపోయాడు. ఫలితంగా అతను తదుపరి బ్యాచ్‌లో అడ్మిషన్‌కు నిరాకరించబడ్డాడు.
తరగతి నుంచి విద్యార్థిని మినహాయించడంతో డాక్యుమెంటరీలు చిత్రీకరించడం, డైలాగ్‌, ఫైనల్‌ ఫిల్మ్‌ ప్రాజెక్ట్‌లు వంటి చలనచిత్ర విద్యలో అంతర్భాగమైన ఆచరణాత్మక సమన్వయ కార్యకలాపాలు అతనికి దూరమవుతాయని అసోసియేషన్‌ వాదించింది. విద్యార్థి యొక్క దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య సమస్యలను పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందని వారు చెప్పారు. కాగా.. నిరాహారదీక్ష కొనసాగుతుండగా ఒక విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నదని అసోసియేషన్‌ తెలిపింది.

Spread the love