లంకలో భారత్‌ మ్యాచులు!

ఆసియా కప్‌హైబ్రిడ్‌ మోడల్‌
దుబాయ్ : 2023 ఆసియా కప్‌పై నెలకొన్న సందిగ్థతకు త్వరలోనే తెరపడనుంది. ఆసియా కప్‌ కోసం పాకిస్థాన్‌లో పర్యటించేందుకు బీసీసీఐ నిరాకరించగా.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సరికొత్త హైబ్రిడ్‌ మోడల్‌ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఆసియా కప్‌లో భారత్‌ ఆడే మ్యాచులను శ్రీలంకలో నిర్వహించనున్నారు. భారత్‌ భాగస్వామ్యం లేని మ్యాచులను పాకిస్థాన్‌లో నిర్వహిస్తారు. 13 రోజుల పాటు సాగే ఆసియా కప్‌లో ఆరు జట్లు 13 మ్యాచులు ఆడనున్నాయి. భారత్‌ ఫైనల్స్‌కు చేరుకుంటే.. టైటిల్‌ పోరు సైతం శ్రీలంకలోనే జరుగనుంది. పీసీబి నూతన ప్రతిపాదనకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ త్వరలోనే ఆమోద ముద్ర వేయనుందని సమాచారం. ఇక తాజా ప్రతిపాదనతో 2023 వన్డే వరల్డ్‌కప్‌, 2025 చాంపియన్స్‌ ట్రోఫీల్లో భారత్‌, పాకిస్థాన్‌ ఇరు దేశాల్లో పర్యటించే అంశంపై సైతం ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. వన్డే వరల్డ్‌కప్‌ కోసం పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రానుండగా.. చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు భారత్‌ సైతం పాక్‌ గడ్డపై అడుగుమోపనుందని క్రికెట్‌ వర్గాలు అంటున్నాయి.

Spread the love