ఇన్‌స్పైర్‌ అవార్డు నామినేషన్ల గడువు 15 వరకు పొడిగించండి

– ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌కు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇన్‌స్పైర్‌ అవార్డుల కోసం నామినేషన్ల గడువును ఈనెల 31 నుంచి వచ్చేనెల 15 వరకు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం రాధారెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం సమర్పించారు. భారీ వర్షాల వల్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించబడ్డాయని తెలిపారు. గత రెండు వారాలుగా విద్యార్థులు కంటి రుగ్మతలు, వైరల్‌ ఫీవర్‌ వల్ల పాఠశాలలకు పూర్తిస్థాయిలో హాజరు కావడం లేదని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి వచ్చేనెల 11 వరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ దశలవారీగా ”ఉన్నతి” శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వివరించారు. విద్యార్థుల నుంచి ఆలోచనలు స్వీకరించడం, అకౌంట్‌ నెంబర్లను సేకరించే ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌/అక్టోబర్‌ వరకు ఇన్‌స్పైర్‌ అవార్డు నామినేషన్లను వేయడానికి సమయమిచ్చారని గుర్తు చేశారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇన్‌స్పైర్‌ అవార్డుల నామినేషన్‌ వేసే గడువును వచ్చేనెల 15 వరకు పొడిగించాలని కోరారు.

Spread the love