ఇరాన్ డ్రోన్లను కూల్చేశాం : అమెరికా
పశ్చిమాసియాలో ఆగని ఉద్రిక్తతలు
టెహ్రాన్/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయిల్ సేనలు లెబనాన్‌పై దాడులు కొనసాగించగా, అమెరికా ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసింది. మరోవైపు కువైట్, బహ్‌రైన్‌లలో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణులతో ఇరాన్ ప్రతిదాడి చేసింది. బీరుట్‌పై భీకర దాడులు.. లెబనాన్‌లో రాజధాని బీరుట్‌పై ఆదివారం ఇజ్రాయిల్ సేనలు దాడులను ఉధృతం చేశాయి. మార్చి 2 నుంచి లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన ఘోరమైన దాడుల్లో దాదాపు 3,613 మంది మృతి చెందారని, వేలాది మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. దక్షిణ లెబనాన్‌లో ఓ సైనిక వాహనంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇద్దరు లెబనాన్ సైనికాధికారులు, ఓ సైనికుడు మరణించారు. నబాటియే జిల్లాలో జిఫ్తా రోడ్డుపై ఒక మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి హత్య చేసింది. దువైర్ పట్టణంలోని ఘమికా పరిసర ప్రాంతంలో నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. నబాతియే నగరం,కఫోర్ పట్టణంపై కూడా కాల్పులు జరిగాయని, అబ్బా,దువైర్ పట్టణాల మధ్య ఉన్న వాతా-అబ్బా రహదారిపై డ్రోన్ దాడి చేయడంతో, ఇద్దరు సిరియన్లు మరణించగా, అనేక మంది గాయపడ్డారని జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి.
ఇరాన్ డ్రోన్లను కూల్చేసాం : అమెరికా
హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన డ్రోన్‌లను కూల్చివేశామని అమెరికా ప్రకటించింది. జలసంధికి ముప్పు కల్గిస్తున్నాయని అందుకే వాటిపై దాడి చేసామంటూ అమెరికా అధికారులు పేర్కొన్నారు. అయితే అమెరికా తరచూ తన వైఖరిని మార్చుకుంటూ దాడలు చేస్తుందని, పరస్పర విరుద్ధ వైఖరులు అవలంబిస్తోందని, అందుకే శాంతి చర్చలు ముందుకు సాగడం లేదని ఇరాన్ విమర్శించింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై ఆదివారం టెహ్రాన్‌లో ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా అమెరికాతో సందేశాలు పంచుకుంటున్నామని చెప్పారు. ‘వైఖరులను తరచూ మార్చుకుంటున్న కారణంగానే ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరపడం ఇబ్బందిగా ఉంది. లక్ష్యాలను మార్చుకోవడం, విభిన్న ప్రకటనలు చేయడం, అధికారులు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం… ఇవన్నీ చర్చలకు ప్రతిబంధకంగా ఉన్నాయి’ అని అన్నారు. ఇరాన్ హక్కులను గుర్తించాలన్న విషయాన్ని అమెరికన్లు అర్థం చేసుకోవాలని, అదే ప్రధాన విషయమని తెలిపారు. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద శాంతియుత అణు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇరాన్‌కు హక్కు ఉన్నదని విషయాన్ని కూడా వారు గ్రహించాలని చెప్పారు. ‘అదే సమయంలో స్తంభింపజేసిన మా ఆస్తుల గురించి అడుగుతుంటే వారు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు’ అని అన్నారు.
బీరుట్‌పై ఇజ్రాయిల్ దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



