కాంగ్రెస్‌లోకి బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్‌

కాంగ్రెస్‌లోకి బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్‌– కండువా కప్పిన దీపాదాస్‌ మున్షీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉన్నారు. ఆ తర్వాత గాంధీ గ్లోబల్‌ ట్రస్టు చైర్మెన్‌ గున్న రాజేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.
రాష్ట్రంలో 16 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌
రాష్ట్రంలో 16 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్‌ఎస్‌యూఐ పని చేస్తున్నదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం 30వేల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నియోజకవర్గాల టూర్‌ షెడ్యూల్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభకు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. నిరుద్యోగుల విజ్ఞప్తిమేరకు మరోసారి టెట్‌ పరీక్షను నిర్వహిస్తామన్నారు. పార్ల్లమెంట్‌ ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది జాబ్‌్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేటీఆర్‌ షాడో సీఎంగా వ్యవహరించారనీ, ఫోన్‌ ట్యాపింగ్‌కు ఆయనదే పూర్తి బాధ్యత అని అన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్లు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
హస్తం మాదిగల నేస్తం కాంగ్రెస్‌లో చేరిన దండోరా ఉద్యమ కారులు
‘హస్తం మాదిగల నేస్తం’ అంటూ ఉమ్మడి పది జిల్లాల నుంచి దండోరా ఉద్యమకారులు కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌ నివాసంలో పార్టీ సీనియర్‌ నేత దేవని సతీష్‌ మాదిగ, చింత స్వామి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది మాదిగ సామాజిక తరగతికి చెందిన నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి, మల్లు రవి, ఏ చంద్రశేఖర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి డాక్టర్‌ బాబు జగ్జవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళలుర్పించారు. ఈ సందర్భంగా సతీష్‌ మాదిగ, చింత స్వామి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మాదిగల మద్దతు కాంగ్రెస్‌ పార్టీకి కూడగట్టి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తామన్నారు.

Spread the love