కాళేశ్వరం విచారణ షురూ..!

కాళేశ్వరం విచారణ షురూ..!నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం విచారణ మొదలుకానుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైకోర్టు నియమించిన రిటైర్డ్‌ జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉన్నతాధికారులు ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీ జనరల్‌ బి అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు జస్టీస్‌ ఘోష్‌ను బూర్గుల రామకృష్ణారావు భవన్‌(బీఆర్‌ఆర్‌కే భవన్‌)లోని ఆయన కార్యాలయానికి తీసుకొచ్చారు. సీట్లో కూర్చొపెట్టారు. ఈ సందర్భంగా కొద్దిసేపు స్పెషల్‌ సెక్రెటరీ, ఈఎన్సీ జనరల్‌ జస్టీస్‌ ఘోష్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి సంబంధించిన వివరాలు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పగుళ్లు, సీపేజీలు తదితర అంశాలపై ఘోష్‌కు వివరించారు. విజిలెన్స్‌తోపాటు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అధ్యయనానికి సంబంధించిన నివేదికలు సైతం ఇచ్చినట్టు సమాచారం. ఇదంతా పరిశీలించిన ఘోష్‌, మరిన్ని వివరాలు కావాలని అడిగినట్టు తెలిసింది. గురువారం ఉదయం మరోసారి ఉన్నతాధికారులు, ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందితో ఉదయం 10 గంటలకు భేటీ కావాలని ఘోష్‌ నిర్ణయించారు. సమగ్ర సమీక్ష అనంతరం మధ్యాహ్నం నుంచి విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. నిజానికి జస్టీస్‌ ఘోష్‌ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై విచారణ ప్రారంభించాల్సి ఉంది. అయితే దాదాపు నెల రోజులు ఆలస్యమైంది. జులై చివరాఖరు వరకు విచారణ సమయాన్ని పెంచే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. విచారణ కమిషన్‌ నివేదికను జూన్‌ 30లోగా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానం చేసింది. జీవో సైతం జారీ చేసింది. ఈమేరకు గురువారం నుంచి జస్టిస్‌ ఘోష్‌ విచారణ అంకాన్ని ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు విచారణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజ్‌లు స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. ఆయన వెంట సాగునీటి శాఖ ఇంజినీర్లు ఉంటారు. ఆయన అడిగే ప్రశ్నలు, సందేహాలను వారు నివృత్తి చేయాల్సి ఉంటుంది. నేరుగా విజిలెన్స్‌, ఎన్‌డీఎస్‌ఏ అధికారులతోనూ మాట్లాడే అధికారం జస్టీస్‌ ఘోష్‌కు ఉంది. అలాగే లేఖలు రాయడం ద్వారా సమాచారం తెప్పించుకోనున్నారు. అవసరమైన వారిని తన కార్యాలయానికి పిలిచి విచారణ చేసే అవకాశమూ ఉంది. విచారణ సందర్భంగా విజిలెన్స్‌, ఎన్‌డీఎస్‌ఏ విచారించిన వారందరిని జస్టీస్‌ ఘోష్‌ సైతం పిలిచే అవకాశం ఉంది. అందరి దగ్గరా స్టేట్‌మెంట్లు తీసుకోనున్నారు. అలాగే మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రాజెక్టుకు సంబంధించిన ఆయా అంశాలపై స్టేట్‌మెంట్‌ రికార్డు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ అధికారవర్గాల సమాచారం. అలాగే ఆయా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు సైతం సమయం ఇవ్వనున్నారు. ఫిర్యాదులు సైతం తీసుకోనున్నట్టు తెలిసింది. జ్యుడీషియల్‌ అధికారాలు కలిగిన ఘోష్‌ విచారణను వీలైనంత త్వరగా ముగించాలనే తలంపుతో ఉన్నట్టు తెలిసింది.
మరింత పెరగనున్న రాజకీయ వేడి
ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి భారీగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను ఎన్నికల్లో ఎజెండా చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావును కాంగ్రెస్‌ టార్గెట్‌ చేస్తున్న విషయం విదితమే. కాళేశ్వరం విచారణ సరిగ్గా ఎన్నికల సమయంలో ప్రారంభం కావడంతో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవైపు కల్లకుంట్ల కవిత జైల్లో ఉండటం, జనంలో బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ దారుణంగా పడిపోయిందనే ప్రచారం నేపథ్యంలో గులాబీ నేతలకు కంటిమీద కునుక లేకపోవడం గమనార్హం. అరోపణలు, విమర్శలతో అధికార పార్టీ కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ దాడికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, బీజేపీతో బీఆర్‌ఎస్‌కు అంతర్లీనంగా ఏదో ఉందనే ప్రచారమూ జరుగుతున్నది. కాళేశ్వరం విచారణ అంకం గురువారం నుంచి ప్రారంభం కానుండటంతో బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా చిక్కులను తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Spread the love