చరిత్రలో చరిత్రతో కారల్‌ మార్క్స్‌

చరిత్రలో చరిత్రతో కారల్‌ మార్క్స్‌ఈ రోజు మార్క్స్‌ జయంతి. మామూలుగా జయంతులు, వర్థంతులు మన మధ్యలేని వారికి సంబంధించినవే. మనిషి అంటే తను చేసిన పని, నడిచిన నడిపిన మార్గం అనుకుంటే మార్క్స్‌కు, మార్క్స్‌ విషయంలో ఈ పదాలు పూర్తిగా వర్తించవు. ఎందుకంటే మార్క్స్‌ మార్గం నడుస్తున్న చరిత్ర. ఎక్కడిదాకానో ఎందుకు , ఈ మే నెల మొదటిరోజున ప్రపంచ వ్యాపితంగా కార్మికులు కష్టజీవులు ఎర్రజెండాలతో నడిచినప్పుడు ఆయన వారితో వున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కూడా మే1నే పుట్టాడు.అంటే ఆయన తర్వాత దాదాపు వందేళ్లకు పుట్టిన సుందరయ్య ఆదర్శం, ఆచరణ కూడా ఇప్పటికీ తెలుగువారిని ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి.సబ్‌కా నామ్‌ వియత్నాం అని ఒక తరాన్ని ఊపేసిన హోచిమన్‌, పుట్టింది మే19నే. ఇప్పటికీ సోషలిస్టు పథంలో పయనిస్తూ గ్లోబల్‌ యుగంలోనూ సిద్ధాంత నిబద్దతను చాటుతున్నది వియత్నాం. రష్యాలో మేడే గురించే తొలి కరపత్రం రాసిన లెనిన్‌, మార్క్స్‌ మార్గంలో ప్రపంచ చరిత్రనే మలుపుతిప్పిన మహావిప్లవ సారథి అయ్యారు. చైనాలోనూ మే4 ఉద్యమం చాలా ప్రసిద్ధికెక్కింది. మార్క్క్‌ బోధనల చరిత్ర అయిపొయిందనుకునే వారికీ, అదేపనిగా చెప్పేవారికి చరిత్ర తెలియదని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈ దేశాలే లేకపోతే ఇప్పుడు ప్రపంచం ఇలా వుండదు. గ్లోబల్‌ మీడియా, గోడీ మీడియాలు కావాలని తొక్కిపడుతున్నా ఆ ప్రభావాలు ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. మొన్న ఒక తెలుగు చానల్‌తో సహా నెట్‌వర్క్‌కు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూను చూడండి.. బెంగాల్‌ను మూడు దశాబ్దాలు అవిచ్చిన్నంగా పాలించిన కమ్యూనిస్టుల గురించి ఇప్పటికీ పలవరించడం కనిపిస్తుంది. ఆ ప్రభుత్వం పోయినా ఇంకా పూర్తి మార్పు రావాలని ముచ్చటపడ్డారు. కమ్యూనిస్టుల గురించి లేదా ఆ భావాలు ఏదో విధంగా ప్రస్తావించకుండా బీజేపీ నేతల ఇంటర్వ్యూలు వుండవు. నిజానికి వారు అతితెలివితో కాంగ్రెస్‌కే ఈ భావాలు ఆపాదించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు సంపదల పున:పంపిణీ గురించిన చర్చ తీసుకుంటే అది సామ్యవాద ప్రేరణతో వచ్చిన మాటని వారికి తెలుసు. కాని దానిపై మరో కోణంలో దాడి చేస్తారు.
కదిలేది, కదిలించేదీ!
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తన పాలన పేదలకూ పెద్దలకూ యుద్ధం అంటున్నపుడు ఇది కమ్యూనిస్టు భావం అని తెలుసు. తెలంగాణను ఇదివరకు పాలించిన కేసీఆర్‌,ఇప్పుడు సీఎంగా వున్న రేవంత్‌ రెడ్డి కూడా ఏదో రూపంలో కమ్యూనిస్టు భావాలను తాము గౌరవిస్తామనే సంకేతం ఇస్తుంటారనేది నిజం కాదా?మళ్లీ ఇదే కాంగ్రెస్‌ కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో వారిని ఓడించడమే ముఖ్యమనుకుంటుంది గాని బీజేపీ మతరాజకీయాలను ఎదుర్కొంటున్నారు గదా అని సానుకూలంగా వ్యవహరించదు. ఎందుకంటే పాలకపార్టీల మధ్య ఎన్ని తేడాలున్నా సరే మార్క్స్‌ సిద్ధాంతాలను నికరంగా, నిరంతరంగా అనుసరించే కమ్యూనిస్టులు మాత్రం పెరగకూడదనేదే వారి ఆలోచన. మరి ఆ పాలక పార్టీలతోనే కమ్యూనిస్టులు ఎందుకు కలసి పనిచేస్తారు, ఎన్నికలకు వెళతారని అడ్డు సవాళ్లు వేస్తుంటారు. అదీ మార్క్స్‌ చెప్పిందే. వ్యవస్థలు, పాలకవర్గాలు, పాలకపార్టీలూ వాటి దోపిడీ వ్యూహాలు అన్నీ ఆయన చెప్పాడు.అయితే వీరబ్రహ్మం కాలజ్ఞానం లాగా కాదు. మార్క్స్‌ది కేవలం తర్కం కాదు, గతి తర్కం. కాలాన్ని పరిణామాలను భిన్న శక్తులను అధ్యయనం చేసి శ్రమజీవులకు మొత్తం సమాజానికి ఏది మరీ ప్రమాదమో దాన్ని అడ్డుకోవడం,ఏది కాస్త ఉపయోగమో దాన్ని ముందుకు తీసుకుపోవడం కర్తవ్యంగా పెట్టుకుని అడుగేయాలన్నాడు. మార్క్స్‌ కాలానికి ప్రజాస్వామ్య సమాజాలు కూడా పూర్తి రూపం తీసుకోలేదు.సార్వత్రిక ఓటు హక్కు కూడా చాలాదేశాల్లో లేదు. తర్వాత కాలంలో ఎంగెల్సు ఈ విషయంలో మరింత స్పష్టత ఇచ్చాడు. ఇన్నేళ్లలోనూ చరిత్ర చాలా పురోగమిం చింది, ఎదురుదెబ్బలూ చూసింది. పురోగమన ప్రస్థానం లోనూ ప్రతికూల పరిస్థితిలోనూ మార్క్స్‌ బోధనలే మార్గదర్శకమయ్యాయి, దారి పొడుగునా గుండెనెత్తురులు తర్పణ చేస్తూ మహాప్రస్థానం సాగుతూనే వుంది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అనుసరించ బడుతున్న అధ్యయనం చేయబడుతున్న మహోపాధ్యాయుడు మార్క్స్‌ మాత్రమే. కారణం ఆయన బోధనల గతిశీలతే. సమగ్రత,సమరశీలత, సందర్భశుద్ధి, సమరశీల కార్యాచరణ, సమిష్టి సంకల్పం, సమూహ కార్యాచరణ ఇవన్నీ కలిశాయి గనకే మార్క్స్‌ మానవాళి చరిత్రపై అనితరసాధ్యమైన ప్రభావం ప్రసరించారు. మార్క్సిజం వర్తమానమూ భవిష్యత్తు తప్ప కేవలం గతం కాదు. మారే కాలానికి తగినట్టు అన్వయశీలత ఆయనలోనే వుంది. దాన్ని శుద్ధతర్కం కింద మార్చిన వారే కొటేషన్స్‌కు పరిమితమై చిలకపలకులు వల్లించేవారిని లేదా దుస్సాహసాలు చేసేవారిని పక్కనపెడితే విశాల ప్రజారాశులు వేల వేల సంఘాలు, సంస్థలూ విశ్వ వ్యాపితంగా విముక్తి పథంలో పయనిస్తూనే వున్నాయి.చైనా వుండకపోతే ఆసియా ఖండంగాని, రష్యా(పుతిన్‌ కాలంలోనైనా) లేకపోతే యూరప్‌ గాని, క్యూబా ఉనికితో సహా వామపక్ష ప్రేరిత ప్రభుత్వాలు లేకపోతే అమెరికా ఖండంగాని ఇలా వుండేవా? సోవియట్‌ విచ్చిన్నం తర్వాత అనేక దురదృష్టకర మైన స్థానిక యుద్ధాలు చేసిన ప్రపంచం మొత్తంగా మరెంత దారుణమైన పరిస్థితులు ఉండేవో ఊహించలేము.
సమగ్ర సిద్ధాంతం,స్పష్టమైన ఆచరణ
కనక మార్క్స్‌ చరిత్ర కాదు, చరిత్రలోనూ చరిత్రతోనూ ఉంటాడు. చరిత్ర నిర్మాణానికి దారి చూపిస్తాడు. మార్క్స్‌ అంటే ఆయనను అనుసరించే అధ్యయనం చేసేవారంతా.ఆ ప్రయత్నం చేసేవారంతా. మార్క్స్‌ బోధనల సమగ్రత సారాంశం వంటబట్టించు కోనివారు, అర్థమై వ్యతిరేకించే వారు, ఏవో పైపై మాటలతో వారిపై దాడి చేస్తుంటారు. ఇంకొందరు వ్యతిరేక శక్తుల ప్రేరణత సవాళ్లు విసురుతుంటారు. నిజానిజాలు, నిర్దిష్ట పరిస్థితులు వారికేమీ అవసరముండదు. ఎందుకంటే వారు ఆయన ఆశయాల బాటలో నడిచే ఉద్యమాలలో ఉండరు. ఆచరణలో పాల్గొనరు. కనుక వాస్తవ సమస్యలు తెలియవు. సమిష్టిచర్చలు, సహచరుల అభిప్రాయాలు, అనుభవాలు వినే అవకాశం, అవసరం కూడా వుండవు. తమకు తోచింది నచ్చింది నచ్చంది అంతే. ఆ మార్గంలో నిలబడటానికి కొనసాగడానికి సిద్ధం కాలేరు. చాలామంది ఆ భావాలు తెలిసినా బయట ఒత్తిళ్ల వల్ల లేదా స్వీయ కాంక్షల వల్ల పదవులో, అవకాశాలో తెచ్చుకోవాలనుకుంటారు. తెలుగురాష్ట్రాలే తీసుకుంటే వివిధ రంగాలలో అలాటి వారు అనేకులు. రాజకీయాలు, వ్యాపారాలు, సినిమా, మీడియా ఒకటేమిటి ప్రతిచోటా ఇలాంటి వారు అందరికీ పరిచయమే. తమ కుటుంబ పెద్దల మార్గంలో ఉద్యమాన్ని గౌరవించే సహకరించే వారూ అనేకులుంటారు. ఏమైనా ఇలాంటి వారిలో అభిమానంతో పాటు అవగాహనా పరిమితులూ వుంటాయి. పరిస్థితుల లోనూ వాటి కారణంగా, వారిలోనూ వచ్చిన మార్పులూ వుంటాయి. సిద్ధాంతపరంగా తాము ఇటే అనుకుంటున్నా ఆలోచనలు గాడి తప్పే ప్రమాదాలుంటాయి. అంతే గాక పాలక వర్గాలు, ప్రభుత్వాలు ఎప్పుడూ కమ్యూనిస్టులపై దాడికోసం బృందాలను తయారు చేస్తుంటాయి.ఇలాంటి వారు కూడా సానుకూలంగా వుంటూనే నిజాయితీగానే అనేక సందేహాలు పెంచుకోవడం కద్దు. వారి మాటలు వినేవారిలోనూ సందేహాలు రావచ్చు.ఈ సందర్భంలో రెండు ఉదాహరణలు చూద్దాం.
ఏపీ, తెలంగాణ ఎన్నికలు
ఏపీలో మూడు పొందికలు రంగంలో వున్నాయి, జగన్‌ పాలనదారుణంగా వుంది గనక బీజేపీతో కలసి గెలవడమే మార్గమనేది టీడీపీని, చంద్రబాబును అభిమానించేవారి వాదన.అంతకుముందు ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీచేసిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ముందే బీజేపీతో వున్నారు.జాతీయంగా మోడీ పాలనలో నిరంకుశత్వాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌ మతతత్వాన్ని కార్పొరేట్‌ అనుకూల మతతత్వాన్ని నిలవరించడం కోసం లౌకికపార్టీలు ఐక్యంగా పోరాడాలనే వైఖరి వామపక్షాలది గనక కాంగ్రెస్‌తో ‘ఇండియా’ వేదికగా ఏర్పడ్డాయి. ఎంత బలం, ఎన్నిసీట్లు అనేది ఎలా వున్నా ఏపీకి కూడా ప్రత్యేకంగా అన్యాయం చేసిన బీజేపీతో కలసిన టీడీపీ, వైసీపీలను రెంటినీ వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మాత్రమే గనక భువనగిరిలో మాత్రం సీపీఐ(ఎం) పోటీ చేస్తూ మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నది. జగన్‌ పాలనను ఓడించడం ఏకైక అవసరం కాగా బీజేపీ సమస్య తీసుకురావడమే మిటని కొందరు అదేపనిగా వాదిస్తుంటారు. అసలు జగనే దీనజనోద్ధారకుడు కాగా కమ్యూనిస్టులు విమర్శించడమే మిటని వైసీపీవారు అంటుంటారు. అదానీ బొగ్గును తీసుకొచ్చి సింగరేణిని బుగ్గి చేసిన కాంగ్రెస్‌ను కమ్యూనిస్టులు ఎలా బలపరుస్తారని కేసీఆర్‌ నిన్ననే సవాలు విసిరారు. రెండు చోట్లా బీజేపీ తన పబ్బం గడుపుకునే ఎత్తుగడలతో మతరాజకీయాలు నడుపుతూనే వుంటుంది.వైసీపీ, టీడీపీ కూడా ఆర్థిక విధానాలలో ఒకటే తరహాగా వుండటం, బీజేపీతో ప్రత్యక్ష, పరోక్ష పొత్తులు కలిగివున్నాయి. అలాగే బీఆర్‌ఎస్‌ కూడా ఉప ఎన్నికలో వారి మద్దతుతో బయటపడి తర్వాత దూరం చేసుకుంది. బీజేపీతో దాని సంబంధాలపై సందేహాలు కూడా కొనసాగు తున్నాయి. ఇలాంటి పరిస్థితుల రీత్యా ఇంతకన్నా భిన్నమైన విధానం కమ్యూనిస్టులు అనుసరించే అవకాశమే లేదు. ఈ రాష్ట్రాలు దేశంలో భాగం కానట్టు, ఇకిక్కడికే పరిమితమై ఆలోచించడం ఎలాసాధ్యం? బెంగాల్‌లో వామపక్ష సంఘటన ఏర్పడి 32 ఏండ్లు పాలించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ వేర్వేరు సమయాల్లో చేతులు కలిపి దాన్ని దెబ్బతీశాయి.ఇప్పుడు బీజేపీ స్థానాలు పెరుగుతుండగా లోపాయికారి అవగాహన కొనసాగుతున్నట్లు సందేహాలు న్నాయి. మమత పాలనలో అమానుషాలనేకం. అయినా వామపక్ష సంఘటన బీజేపీని, టీఎంసీని వ్యతిరేకించి పోరాడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరినప్పటికీ భువనగిరిలో పోటీ విరమించుకోవడానికి నిరాకరించింది. ఇంత కచ్చితమైన విధానమే మార్క్స్‌ సిద్ధాంత నిర్దేశమే.
శ్రామిక ప్రస్థానం ఆగిందా?
సాంకేతికంగా గొప్ప పురోగమనం వచ్చింది గనక వర్గపోరాటం కార్మిక శక్తి వంటి మాటల పదును తగ్గిందనే వాదన చేస్తుంటారు చాలామంది. శ్రామికుల శ్రమతో అదనపు విలువ ఆర్జించే పెట్టుబడిదారీ విధానం ఉత్పత్తి పరికరాలు సాధనాల ఆధునీకరణ చేస్తూనే ఉంటుందనేది మార్క్స్‌ ప్రాథమిక సూత్రం. శ్రామికుల పాత్రను తగ్గించి లాభాలు పెంచుకోవడం దీని ఏకైక లక్ష్యం. ఇప్పుడు రోబోలు, కృత్రిమ మేధ (ఎఐ)లు ప్రవేశించాయి. ఈ క్రమం పరాకాష్టకు చేరింది. కానీ పోరాటాలు పోయాయా? కార్మికు ల శక్తికి కంప్యూటర్లు ప్రత్యామ్నాయం కావు. కంప్యూటర్ల నిపుణులు కూడా ఎఐ వచ్చాక వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతూ వీధిన పడుతున్నారు. డ్రైవర్లు లేనికార్లు, నిర్మాణ కార్యకలాపాలలోనూ భారీ పరికరాలు ఏ విధంగా పనులు పోగొట్టాయో ఈ ఎఐ కూడా అందుకే దారితీస్తున్నది, (దీనికి రాజకీయం కూడా మేళవించి ఇజ్రాయిల్‌ దురాక్రమణపై నిరసన తెలిపిన వారిని కూడా గూగుల్‌ పిచ్చరు తీసేస్తున్నారు) ఇప్పుడు ఈ వర్గాలలో అలజడికీ ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్‌ కాలూనిన తర్వాత బయటిదేశాలు అటుంచి ఆ దేశస్తుటే ఉక్కిరిబిక్కిరవుతున్నారు.నిజానికి వీటన్నిటినీ అర్థంచేసు కోవడానికి అవసరమైన అవగాహన బీజ రూపంలో మార్క్స్‌లోనే మనకు దొరుకుతుంది. ఆ ప్రభావం వైజ్ఞానిక కళా సాహిత్య, సాంస్కృతిక రంగాలపై చూపిన ప్రభావం మరో పెద్ద అంశం, అవి లేకుండా ఆధునిక జీవితమే లేదు.అందుకే మార్క్స్‌ చరిత్రను నడిపే ప్రేరణగా ఉంటూనే ఉంటాడు. మహాప్రస్థానం సాగుతూనే ఉంటుంది.
తెలకపల్లి రవి

Spread the love