రెండున్నరేండ్లుగా వ్యవసాయశాఖపై
రివ్యూ చేయలేదంటూ సీఎంపై ఆగ్రహం
తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ డిమాండ్
లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలంటూ హెచ్చరిక
టీఆర్ఎస్ చీఫ్ అరెస్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం హైదరాబాద్ లోని సచివాలయం ముందు వడ్లు పోసి నిరసన తెలిపారు. సచివాలయం ప్రధాన ద్వారం ముందు కవిత వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలతో కలిసి వరికంకులు, ప్ల కార్డులతో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్తాల్లో తీసుకొచ్చిన వడ్లను కొందరు రైతులు సచివాలయం ముందు పోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కవితతో సహా రైతులు, మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష చేయలేదని విమర్శించారు. ధాన్యం, ముక్కలు, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలు కొనక పోవటంతో రైతులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉందంటూ ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారనీ, తరుగు పేరిట మోసం చేస్తున్న పట్టించుకునే వారు లేరని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 45-46 డిగ్రీల టెంపరేచర్ లోనూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నా… కొనుగోలు కేంద్రాల్లో కనీసం తాగడాని నీళ్ళు లేవనీ, టెంట్లు కూడా వేయలేదని కవిత ప్రభుత్వ నిరక్ష్యంపై మండిపడ్డారు.
వడ దెబ్బకు గురై కొందరు చనిపోతే, పంటలను కొనే వారు లేక, అప్పులు తీరే దారి కనిపించక మరికొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు చనిపోతున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలని, రైతులకు మేలు చేయాలని సచివాలయం వద్ద ధర్నా చేశామని కవిత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు, జొన్నలు, పొద్దు తిరుగుడు పంట కొనటం లేదన్నారు. వెంటనే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చాక కవిత మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లు గ్రేడ్ ఏ వరిని గ్రేడ్ బిగా రిజిస్టర్ చేస్తూ సన్న బియ్యానికి ఇచ్చచే బోనస్ ఎగ్గొడుతున్నారని విమర్శించారు. యూరియా యాప్ ఎవరికి అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు, జొన్నలు, పొద్దు తిరుగుడు సహా అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.



