నాయకులొస్తున్నారు

నాయకులొస్తున్నారుఎలక్షన్లలో ఓట్ల కలెక్షన్స్‌ కోసం
సంకలెగరేస్తూ వస్తున్నారు
కద్దరంగీల మెరుపుల ఉరుకులతో
ఊహకందని ఆలోచనలతో
పరుగు పరుగున వచ్చేస్తున్నారు
వీధి వీధిలో
తూతూ మంత్రాల చిట్లింపుల్ని
ఎంతో ఆర్భాటంగా వల్లించడానికి
కనివిని ఎరుగని మమకారంతో
కారెక్కి ఇట్లనే వస్తున్నారు
భుజాల్ని తడిమేసి
నవ్వుల్ని విసిరేసి
వాగ్ధానాల బాణాలతో
నమ్మకాన్ని వెంటాడి పట్టడానికి
రయ్యి రయ్యిన వచ్చేస్తున్నారు
గుడిసె గుడిసెను తట్టి
ప్రతి వ్యక్తిని నిద్ర లేపి
బాగోగులు కనుక్కొని
ఓటు కొనుక్కోడానికి ఏకంగా
బారులు తీరి నిలుచుంటారు
భవిష్యత్తులో
అభివద్ధి అందలమెక్కే చిత్రాల్ని
అరచేతిలో చూపిస్తూ
నమ్మకాన్ని కొల్లగొట్టే తీరుకు
ఊతమిచ్చి కదులుతున్నారు
అయ్యా నాయకులొస్తున్నారు
ఆకలి కడుపుల్ని నింపుతామని
మనసు గాయాన్ని మాపుతామని
జెండాలేసుకు వచ్చేస్తున్నారు
ఎన్నడూ ఎరుగని దారుల్ని
వెతికి వెతికి పట్టుకుంటూ
నాలుగు చక్రాల వాహనాల్లో
అద్దంలో నుంచి చూస్తూ వస్తున్నారు
వలసెల్లిన పల్లెను ఓదార్చడానికి
చితికిల పడిన రైతు భుజం తట్టడానికి
బడుగులు అడుగంటిన తీరును
లాలించి బుజ్జగించడానికి
ముందస్తు ప్రణాళికలతో
సక్కగా ఇట్లనే వచ్చేస్తున్నారు
అయ్యా నాయకులొస్తున్నారు
ఐదేండ్లకోసారి
ముచ్చట్లతో మురిపించడానికి
ముద్దరేసే వేళ్లను లెక్కించడానికి
వచ్చేస్తున్నారు..
– నరెద్దుల రాజారెడ్డి
సెల్‌: 9666016636

Spread the love