‘అష్టవంకర్ల నవభారతం’ – పుస్తక పరిచయం

'అష్టవంకర్ల నవభారతం' - పుస్తక పరిచయంప్రముఖ రాజకీయ విశ్లేషకులు, రచయిత పరకాల ప్రభాకర్‌ రాసిన ‘అష్టవంకర్ల నవభారతం’ పదేండ్ల మోడీ పాలన డొల్లతనాన్ని బయటపెట్టింది. తలకిందులుగా ఉన్న ప్రపంచంలో ఏ వ్యవస్థలైనా అడ్డదిడ్డంగా అష్టవంకర్లతో ఉండడం సహజమే. దశాబ్దన్నర కాలంగా ఈ దేశపు నడతా, నడకా భీతి గొలుపుతోంది. వెన్నెముక లేని మీడియా, మచ్చికైన అన్ని సమాచార వ్యవస్థలూ ఆప్టికల్‌ ఇల్యూషనరీ, డిజిటల్‌ ఇమేజరీ లతో అన్ని వంకర్లనీ సరళరేఖల్లా కనబడేలా చేయడంలో తమ పాత్రని బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నాయి. మెజారిటీ ప్రజలకు అందే 90 శాతం సమాచారమంతా ఈ దేశపు నేతల తాలూకూ స్తోత్ర పాఠాలు. మహా అయితే ”డివైన్‌” కామెడీలు. జాతీయ వార్తలు రాజకీయ నాయకుల రోజువారీ డైరీల నివేదనలు. ప్రభాకర్‌ ఈ వ్యాసాలు విభిన్న సందర్భాల్లో రాసినవే అయినా వీటిలో లౌకిక, ఉదారవాద, బహుళవాద స్వభావంలోనూ, ప్రజాస్వామిక విలువల విషయంలో దారుణంగా రాజీపడినతీరు, గణతంత్ర వ్యవస్థ నుండి భారత్‌ ఎంతగా దిగజారిందో చెప్పే ప్రయత్నం చేశారు. జేఎన్‌యూ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ లాంటి ప్రతిష్టాకర విద్యాసంస్థల్లో చదువుకుని, సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్ని నికార్సైన సమాచారంతో సాధికారికంగా వ్యాఖ్యానిస్తూ వచ్చే ప్రభాకర్‌ ఈ వ్యాస సంకలనం చదువరులతో చాలా విషయాలు ముట్టడిస్తుంది. అందుకే ఈ పుస్తకం విలువ అపారం.
వలసవాద ఆలోచన నిర్మూలన గురించీ, మూలాల గురించి గర్వపడటం గురించీ, ప్రజలు విధులు పాటించటం లాంటి అమృత కాలపు ఐదు ప్రతిజ్ఞల గురించే కాదు, దరిద్ర నిర్మూలన, ఆకలి, అసమానతల గురించీ, విద్వేషాలకు తావివ్వని సమాజం గురించీ ఏ హామీలు లేవన్న విషయాన్ని గురించీ ప్రశ్నిస్తుంది. అంతేకాదు వంకర తిరిగిన ప్రతిపక్షం కాళ్లను తిన్నగాచేసి, కలిసికట్టుగా నిలబెట్టే పని జరక్కపోతే మోడీ, షాల నాయకత్వంలోని బీజేపీ, ఎన్నికల్లో ఓటమిపాలైనంత మాత్రాన భారత గణతంత్ర వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రమాదం అదృశ్య మవ్వదనే చేదు నిజాన్నీ చెబుతుంది. ఒకే మతస్తుల దేశమనే తప్పుడు పునాదిపై నిలబెట్టే సంకుచిత భావనని తుడిచేయాల్సిన అవసరాన్నీ, అమ్ముడుపోయే రాజకీయ పార్టీల గురించి అప్రమత్తం చేయకపోతే పొంచున్న ప్రమాదాల గురించీ చెబుతుంది.
1990 నుంచి నూతన బీజేపీ అంతకంతకు ఎదిగిన వైనాన్ని పూసగుచ్చినట్టు వివరించారు ప్రభాకర్‌. భారత చరిత్రలో హిందూ, హిందూత్వ, భారతీయ అస్తిత్వం చాలాకాలం వరకు ఒక అంగీకృత రాజకీయ భావనగా లేదనీ క్రమంగా హిందుత్వ భావన ప్రజల్లోకి ఎలా చొప్పించారో ప్రభాకర్‌ శక్తివంతంగా వివరించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ”జనాభా” రాజకీయాల గురించి మాట్లాడుతూ, ఒకవైపు జనాభా పెరుగుదల (2.1) సాధారణ స్థాయిలోనే ఉన్నా, దేశాభివృద్ధికి జనాభా వేగంగా పెరగడమే ఆటంకం అంటూ చెప్పడం వెనుక చాలా స్పష్టమైన సంకేతం ఉందంటారు పరకాల. జనాభా లెక్కల్ని ఆసాంతం అధ్యయనం చేసి ఆ విస్ఫోటనలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. మరీ ముఖ్యంగా యూపీలో ప్రభుత్వం వ్యక్తం చేసే ఒక అసంబద్ధపు జనాభా అసమతుల్యత గురించి వాస్తవాలు విప్పే ప్రయత్నం చేశారు. మూడో బిడ్డని కంటే రూ.5 లక్షల జరిమానా లాంటి అంశాలను కూడా చర్చించారు.
2021 ప్యూ నివేదిక ఆధారంగా భవిష్య రాజకీయ వ్యవస్థ ఎలా ఉండబోతుందో విశ్లేషణ చేశారు. 95 కోట్ల వయోజనులున్న దేశంలో ఒక శాతం కంటే తక్కువ శాంపిల్‌ సర్వే తో దేశ భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తారో అనూహ్యమన్నారు. అమెరికాలో జాతి వివక్ష మీద బాహ్యంగా వెలువరించే అభిప్రాయాలకంటే చాలా ఎక్కువ జాతి వివక్ష జనాల్లో ఉన్నట్లే, ‘మనుషుల్ని కొట్టి చంపటం హిందూత్వకు విరుద్ధం’ అని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, సోషల్‌ మీడియాలో ముస్లిం వ్యతిరేక విద్వేష ప్రచారం చేయడం లాంటిదేననీ స్పష్టం చేస్తారు.
భారత్‌ వెలుగుతోందా? మిణుకుమిణుకు మంటోందా?
భారత్‌ 132వ స్థానంలో వెలిగిపోతోంది మిణుకు మిణుకుమంటూ! మనకు తోడుగా మయన్మార్‌ 149, నేపాల్‌ 143 స్థానంలో! ఆఖరికి శ్రీలంక కూడా 73వ స్థానంలో ఉంది! మరి విశ్వగురుత్వానికి ఈ రాంక్‌ చాలా? ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆశ్రితులకు అప్పజెప్పి అచ్చేదిన్‌ ప్రజలకు తెచ్చివ్వడం సాధ్యమేనా? అని ప్రశ్నిస్తారు. 75 ఏళ్ల ఆజాదీ అమృత మహోత్సవంలో బిల్కిన్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ నేరస్తులని విడుదల చేయడమూ, 2021 ఎన్నికల్లో ముఖ్యమంత్రే స్వయంగా, 80శాతం హిందువులకి 20శాతం ముస్లింలకీ మధ్య జరిగే ఎన్నికలే ఇవి అని ప్రకటించడమూ, ఉత్తరాఖండ్‌లో ”ధర్మ సంసద్‌” లో ”20 లక్షల మంది ముస్లింలను మనం వంద మందిమి చంపడానికి సిద్ధపడితే, భారతదేశం హిందూ దేశంగా మారిపోతుందని” ఒకడు నేరుగా ప్రకటించడమూ, యూనివర్సిటీలూ, శాస్త్ర సాంకేతిక విద్యాసంస్థలూ, సైన్స్‌ కాంగ్రెస్‌ సభలూ అన్నీ క్రమంగా కాషాయపు రంగు పులుముకోవడమూ, అహర్నిశలు పనిచేసే డిజిటల్‌ వేదికల ద్వారా పనిగట్టుకుని అశాస్త్రీయ అంశాలను ప్రచారంలో పెట్టి ప్రజలను గందరగోళపరచటమూ, ఫేస్బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, యాజమాన్యాలపై పట్టు సాధించటమూ, ఎలక్ట్రోరల్‌ బాండ్ల ద్వారా రూ.5 వేల కోట్ల పార్టీ ఫండ్‌ను వసూలు చేసుకోవడమూ గురించి వివరించారు. స్కిల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్ట్‌ అప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌, బేటి పడావో బేటి బచావో, అమృత్‌కాల్‌ లాంటి అంతూ పొంతూ లేని మిథ్యా ప్రతిబింబాల గురించి ఆందోళన చెందుతారు ప్రభాకర్‌.
ఈ దేశపు అంతులేని అసమానతల గురించి మన ముందుంచిన సత్యాలు దిగ్బ్రాంతికరంగా ఉంటాయి. కోవిడ్‌ -19 కారణంగా 99శాతం మానవాళి ఆదాయాలు ఘోరంగా పడిపోగా అది ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతి 26 గంటలకు ఒక కొత్త బిలియనీర్‌ సృష్టించబడగా, పేదరికపు కూపంలోకి జారిపోయిన భారతీయులు 60శాతం మందనీ, మొదటి పదిమంది ధనవంతుల్లో ఒక్కొక్కడు రోజుకు పది లక్షల డాలర్ల చొప్పున ఖర్చు పెడితే వాళ్ళ సంపద కరగటానికి 441 సంవత్సరాలు పడుతుందనీ, అదే సమయంలో సంవత్సరానికి 21లక్షల మంది ఆకలితో మరణిస్తున్నారనీ, ప్రతి నాలుగు సెకండ్లకు ఒకరు మరణిస్తున్నారనీ, 77,500 కోట్ల డాలర్ల 100 మంది భారతీయుల సంపదలో 5 శాతం పెరుగుదల ఒక్క ఆదానీ గ్రూప్‌దేననీ చెబుతారు.
వ్యవసాయ రంగం గురించి
జీడీపీలో 27శాతం వ్యవసాయ రంగానిదే అయినా, 64శాతం గ్రామీణ శ్రామిక శక్తి ఈ రంగంలోనే వున్నా, 2004- 2012 మధ్యలో మూడు కోట్ల మంది వ్యవసాయాన్ని ఎందుకు వదిలేశారో, ఈ నేపథ్యంలో వచ్చిన వ్యవసాయక చట్టాల రద్దును ఎందుకు కోరారో విశ్లేషించారు. ఈ దేశంలో వ్యవసాయం గురించి మాట్లాడటం అంటే ఈ దేశపు ప్రతి ఆరు కుటుంబాల్లో ఓ కుటుంబం గురించీ, 86శాతం చిన్న సన్నకారు రైతాంగం గురించీ మాట్లాడుతున్నట్టేనంటారు. వ్యవసాయం గురించి నిర్ణయం అంటే 54శాతం ప్రజల గురించి నిర్ణయమేననీ అయినా కూడా 1965లో జరిగిన వ్యవసాయ రంగం మీద చర్చ తర్వాత ఈ దేశపు వ్యవసాయ రంగం గురించి మళ్లీ కూలంకషంగా చర్చ జరిగిన దాఖలాలే లేవంటారు. ఇదే సమయంలో వ్యవసాయక చట్టాలు సమర్ధించే ఆర్థికవేత్తలు, ‘కనీస మద్దతు ధర’ అవసరం లేదని ఎందుకు భావిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తారు.
మహమ్మారి – అరాజకీయం గురించీ
అన్నింటికన్నా ప్రముఖంగా కోవిడ్‌ సంక్షోభంలో ఆలోచించటాన్నీ, రాయడాన్నీ, మాట్లాడటాన్నీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంగా ఎలా ముద్రవేశారో తాను స్వయంగా ఎదుర్కొన్న అనేక అనుభవాలని చెబుతారు. కోవిడ్‌ సమయంలో ట్విట్టర్‌ను ప్రభావితం చేయడం, బ్రెజిల్‌ తర్వాత కోవిడ్‌ మరణాల సంఖ్య ఇండియాలో ఎక్కువైనా మోడీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, జీడీపీలో రూ.1.8 లక్షల కోట్ల మేర నష్టం జరిగినా, రెండే రెండు వారాల్లో 15 లక్షల మంది ముంబై నుంచి వలస కార్మికులు వెళ్లిపోయినా, ఒక్క మహారాష్ట్రనే రూ.82 వేల కోట్ల విలువైన ఆర్థిక ఉత్పత్తి కోల్పోవడం జరిగినా మౌనంగా ఉండిన ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నిస్తారు ప్రభాకర్‌. నార్వే, స్వీడన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, బ్రెజిల్‌, ఇటలీ ఇంకా ప్రపంచంలో అనేక దేశాలు కోవిడ్‌ మీద దర్యాప్తులకు స్వయంగా ప్రభుత్వాలే చేపడితే ఇక్కడ కోవిడ్‌ కోసం 35 వేల కోట్ల రూపాయల ఖర్చు గురించీ, పిఎం కేర్‌ ఫండ్స్‌ గురించీ లెక్కల వూసే లేదంటారు. వ్యాక్సిన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంతవరకూ ప్రభుత్వ సంస్థల కంటే ప్రయివేటు ఆస్పత్రుల సరఫరాకే మొగ్గు చూపిన వైనాన్ని ఆధారాలతో సహా బయటపెడతారు.ఈ పుస్తకంలో ప్రముఖుల మూలాల్ని ఏవిధంగా పెకలించారో, ఫాదర్‌ స్టాన్‌ స్వామి వంటి వారి మరణానికి కారణమైన కాఠిన్య చట్టాల గురించీ, ఇతర అనేక అంశాల గురించీ వివరంగా రాశారు పరకాల ప్రభాకర్‌.
”నాది నిస్సందేహంగా, నిస్సంకోచంగా వినిపించే విమర్శనాత్మక అసమ్మతి గళం. సూటిగా, నేరుగా వినిపించే గొంతుక. మన ప్రభుత్వమూ, ప్రజావ్యవస్థలూ, నేతలూ, రిపబ్లిక్‌ ఆశయాల నుండీ, ప్రకటించిన లక్ష్యాలనుండీ, ప్రజలకు చేసిన వాగ్దానాల నుండీ వైదొలిగితే, అధికారంలో ఉన్నవారికి వాస్తవాన్ని నేరుగా ఎత్తిచూపే స్వరమిది.” ప్రభాకర్‌ గారి ఈ స్వరం భాస్వరమై మండాల్సిన తరుణమిది.
(డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ రాసిన (ునజు జ=ఉఉఖజుణ ు×వీదీజు= ఉఖీ చీజుఔ ×చీణ×A)
”అష్టవంకర్ల ‘నవ’ భారతం” సంకలనంపై సమీక్ష)
వి.విజయ్ కుమార్‌
8555802596

Spread the love