సమ్మె పట్ల మొండివైఖరి వీడాలి

– సమ్మెను మరింత ఉధృతం చేస్తాం
– రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల హెచ్చరిక
నవతెలంగాణ-నల్లగొండ
ఐకేపీ వీఓఏల ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 34 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అఖిలభారత న్యాయవాదుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల శంకరయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.పర్వతాలు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ. జనాలుద్దీన్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీ.శ్యాంసుందర్‌, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పీ.వెంకటేశం, సామాజిక తెలంగాణ పొలిటికల్‌ ఫ్రెంట్‌ నాయకులు నజీరుద్దీన్‌, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్‌ దండెంపల్లి సరోజ హెచ్చరించారు. గత 34 రోజులుగా తమ హక్కుల కోసం మండుటెండల సైతం లెక్కచేయకుండా విరోచితంగా పోరాడుతున్న ఐకెపి వివోఏ ఉద్యోగులకు సంఘీభావంగా శనివారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో18 వేల మంది వీవోఏలు డ్వాక్రా సంఘాల్లో పనిచేస్తున్న 40 లక్షల మంది మహిళలకు అనేక రకాల సేవలు అందిస్తున్నారు. కాని వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా రూ.3,900 వేతనంతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించిన శాంతియుతంగా ఆందోళన చేసిన పట్టించుకోని నేపథ్యంలోనే నిరవధిక సమ్మెలోకి వెళ్ళామని ఇప్పటికీ 34 రోజులు కావస్తున్న ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వివో ఎలు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలు కావని చాలా న్యాయమైనవి అని వాటిని కూడా పరిష్కారం చేయకుండా సమ్మెను విచ్చిన్నం చేయాలని నిర్బంధాన్ని కొనసాగిస్తే ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని వారు హెచ్చరించారు. సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పోరాట కార్యాచరణను రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వం ఇప్పటికైనా యూనియన్‌లతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 22న కలెక్టరేట్లు ముట్టడిస్తామని, 29న సెర్ఫ్‌ ఆఫీసు ముట్టడి, ఆ తర్వాత మరింత సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో బీఆర్‌టీయూ నియోజకవర్గ అధ్యక్షులు ఔటర్‌ రవీందర్‌, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు అద్దంకి నరసింహ, పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి, హమాలి ఫెడరేషన్‌ జిల్లా నాయకులు నగర కంటి సుందరయ్య, ఆవురేసు మారయ్య, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోతేపాక వినోద్‌ కుమార్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు పెరిక కృష్ణ, పందుల లింగయ్య, వివిధ సంఘాల నాయకులు వివో ఏలు ఏదుల లక్ష్మి, గుడిసె సువర్ణ, వై కోటిరెడ్డి,అవుతా సైదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love