Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమిషన్‌ మోడ్‌లో 'ఎల్‌నినో' ఎదుర్కొందాం

మిషన్‌ మోడ్‌లో ‘ఎల్‌నినో’ ఎదుర్కొందాం

- Advertisement -

ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలపై గ్రామ గ్రామానా చైతన్యం
తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు యాక్షన్‌ ప్లాన్‌
‘మిషన్‌ మోడ్‌’లో ఉమ్మడి కరీంనగర్‌ కార్యాచరణ :
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,
 శ్రీధర్‌ బాబు, పొన్నం, అడ్లూరి
కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమీక్షలో మంత్రుల దిశా నిర్దేశం!
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ‘మిషన్‌ మోడ్‌’లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆర్థికంగా లాభసాటి పంటలను ఎంచుకోవాలని మంత్రులు సూచించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఆదివారం ఎల్‌నినో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాలుగు జిల్లాల కలెక్టర్లతో కలిసి ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్‌ వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.​ ​
సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలపై కూడా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. ముందస్తు చర్యలే ప్రజలను రక్షిస్తాయని, ప్రభుత్వం ఇప్పటికే రూ.9 వేల కోట్లను ‘రైతు భరోసా’ కింద విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల తగ్గుదలపై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ఎల్‌నినో పెద్ద సవాల్‌ అని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి ప్రజల్లో ధైర్యం నింపాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపునకు వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలన్నారు. కొత్త ఇండ్ల నిర్మాణ అనుమతుల్లో ఇంకుడు గుంతలను తప్పనిసరి చేయాలని, దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కరోనా సమయంలో చూపిన సమిష్టి స్ఫూర్తితోనే ఇప్పుడు ఎల్‌నినో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని రైతులను, ప్రజలను కాపాడుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, విజయరమణారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, కల్వకుంట్ల సంజయ్‌, మేడిపల్లి సత్యం తదితరులు క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావించారు. ఉమ్మడి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ మహేశ్‌ దత్‌ ఎక్కా, కలెక్టర్లు చిత్రా మిశ్రా, గరీమా అగర్వాల్‌, సత్యప్రసాద్‌, కోయ శ్రీహర్ష స్పందిస్తూ.. ఇప్పటికే ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశామని, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాను ఎల్‌నినో నివారణలో రాష్ట్రానికే మోడల్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -