ఆమె ఓ డాక్టర్. రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం. కానీ అది ఆమెకు తృప్తినివ్వలేదు. సామాజిక మార్పు కోసం పని చేయాలనుకున్నారు. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నారు. సేవా రంగంలో ఉండాలని సివిల్స్ రాసి ఐఆర్‌ఎస్ అధికారి అయ్యారు. దేశీయ, అంతర్జాతీయ పన్నులు, ఆర్థిక నేరాల దర్యాప్తులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఆరు రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేస్తున్న సమర్పన్ అనే ఎన్‌జీఓకు ముఖ్య సలహాదారుగా ఉన్నారు. గ్రామీణ పిల్లలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా తీర్చుదిద్దుతున్నారు. ఆమే మేఘా భార్గవ. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
మేఘా రాజస్థాన్‌లోని కోటాలో పెరిగారు. డాక్టర్ కావాలనేది ఆమె చిన్ననాటి కోరిక. ఆమె తల్లి ఓ పాఠశాల ప్రిన్సిపాల్. దాంతో చిన్నతనం నుండి తన కూతుర్లకు విద్యా విషయాలు, పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తూ ఉండేది. AIPMT పరీక్షలు రాసిన తర్వాత మేఘా డెంటిస్ట్రీని అభ్యసించడానికి ముంబయిలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేరారు. అది పూర్తి చేసిన తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన డెంటల్ ఆసుపత్రిలో రెండేండ్లు పని చేశారు. ”ఈ కాలంలో ఒక క్రమశిక్షణతో కూడిన సంస్థలో పని చేసే మంచి అవకాశం నాకు వచ్చింది. అలాగే నాలోని నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడం కోసం ఇంకా ఏదైనా చేయాలను న్నాను. దానికి సివిల్ సర్వీసెస్ సరైన ఎంపిక అని అనిపిం చింది” అని మేఘా చెప్పారు.
మొదటి ప్రయత్నంలోనే…
ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రిలో పనిచేసేవారు. సివిల్ పరీక్షల కోసం సిద్ధం కావడానికి సాయంత్ర సమయాన్ని కేటాయించుకున్నారు. Orkut, Facebook సమూహాలు, బ్లాగులను శోధించి, తన మొదటి ప్రయత్నంలోనే ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండా పరీక్షలు రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)లో చేరారు. ”అకాడెమీ నాకు అకౌంటింగ్, పన్ను చట్టాలు, వృత్తికి సంబంధించిన అన్ని విషయాల్లో నాకు శిక్షణ ఇచ్చింది. కానీ కేసులను సమీక్షించడం, బ్యాలెన్స్ షీట్‌లను పరిశీలించడం, పరిశోధనలు నిర్వహించడం వంటివి చేసినప్పటికంటే అసలు శిక్షణ ఉద్యోగంలోనే ఉంటుంది” అని ఆమె అంటారు.
కీలక పథకాలను అమలు చేస్తూ…
తనకు సుపరిచితమైన నగరం, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మేఘ మొదటి పోస్ట్‌ంగ్. 2012 నుండి ఆమె పన్ను పరిపాలనలో భాగంగా, విచారణాధికారిగా కూడా ఉన్నారు. ఇది ఇప్పటివరకు అత్యంత సవాలుగా ఉన్న అసైన్‌మెంట్‌లలో ఒకటిగా ఆమె చెబుతారు. గోప్యత కారణంగా నిర్దిష్ట కేసులను బహిర్గతం చేయలేక పోయినప్పటికీ, పన్ను ఆధారాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చు కోవడం, విచారణ సమయంలో, అసెస్‌మెంట్‌ల సమయంలో దానిని విస్తృతం చేయడం ద్వారా తనకు మంచి స్థానం లభించిందంటారు. అంతర్జాతీయ పన్నులలో ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ పన్ను ఒప్పందాలు, OECD మోడల్ టాక్స్ కన్వెన్షన్‌ను అనుసరించి పన్నుల అమలును కూడా ఆమె బహిర్గతం చేశారు. జాయింట్ కమీషనర్, ఇన్‌కమ్ టాక్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు గత ఏడాది ప్రారంభించిన ప్రభుత్వ ఇ-ధృవీకరణ పథకాన్ని అమలు చేయడంలో ఆమె ప్రస్తుతం నిమగమై ఉన్నారు.
సామాజిక మార్పును నడిపిస్తుంది
మేఘా సోదరి రుమా భార్గవ ప్రారంభించిన ఎన్‌జీఓ సమర్పన్‌తో చేరి సామాజిక మార్పు కోసం పని చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016లో స్థాపించబడిన ఈ సంస్థకు ఆమె ముఖ్య సలహాదారు. ఇది మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలలో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల కోసం పని చేస్తుంది. వివిధ కార్యక్రమాల ద్వారా 90పైగా పాఠశాలల్లోని 26,000 మంది పిల్లల జీవితాలపై ఈ సంస్థ ప్రభావం చూపింది. ”పిల్లలకు విద్యతో పాటు రుతుక్రమ పరిశుభ్రత, వాష్ (నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత), పాఠశాలల సౌర విద్యుదీకరణ, జీవనోపాధిని సృష్టించడం మా ప్రధాన ప్రాజెక్టులు” అని మేఘా వివరించారు.
సుదూర ఫలితాలకై…
”మా సంస్థ ఎక్కువగా వాలంటీర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలల, ప్రధానోపాధ్యాయుల నిర్వహణ కమిటీలతో కలిసి నడుస్తుంది. పౌర సమాజం, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో సరైన లబ్ధిదారులను గుర్తించడంలో, కార్యక్రమాలను కింది స్థాయిలో అమలు చేయడంలో అందరూ కలిసి రావాలి. సుదూర ఫలితాలను సాధించేందుకు మరికొంతమంది వాటాదారులందరితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆమె అంటున్నారు.
చేయి చేయి కలిపి…
కోవిడ్ -19 సమయంలో, సమర్పన్ 25 లక్షల మందికి భోజనం, కుటుంబాలకు రేషన్, మహిళలకు శానిటరీ ఉత్పత్తులు, పిల్లలకు పాల ప్యాకెట్లను అందించడానికి బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (BMC)తో కలిసి పని చేశాము. బెంగళూరు, హైదరాబాద్, కోటతో పాటు ఇతర నగరాల్లో కూడా ఈ కార్యక్రమాలను చేయగలిగాం. అలాగే స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు చేయి చేయి కలిపి పనిచేశాయి. సమాజాకి కార్యక్రమాలు చేయడం కోసం మంచి కెరీర్‌ని వదులుకోవడం కష్టంగా లేదా అడిగినప్పుడు మేఘా తన అభిరుచి అన్ని సవాళ్లను అధిగమిస్తుందని చెప్పారు.
చిరునవ్వు విలువైనది…
”ఏదైనా చేయాలనే అభిరుచి మనకు నిజంగా ఉంటే దాన్ని చేయడానికి సహకారం కచ్చితంగా దొరుకుతుంది. నేను నా సోదరితో కలిసి అంకితభావంతో పని చేస్తున్నాను. మేమిద్దరం కలిసి క్షేత్ర సందర్శనలు చేస్తాం. పిల్లల ముఖంలో చిరునవ్వు విలువైనది. ప్రజలకు సహాయం చేసినపుడే మన జీవితానికి నిజమైన అర్ధం లభిస్తుంది” అంటారు మేఘ. ఆర్థిక, ఆరోగ్య, విద్యా రంగాలలో మంచి విధానాలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆమె ఎదురుచూస్తున్నారు.
అవగాహన కల్పిస్తూ…
రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోని పిల్లలకు సుమారు 3,200 అధ్యాయన్ కిట్లు (స్టేషనరీ) పంపిణీ చేశారు. కరెంటు లేని గ్రామాల్లో వెలుగులు నింపేందుకు ఈ స్వచ్ఛంద సంస్థ 18 గంటల పాటు పని చేసే సోలార్ లాంతర్లను పంపిణీ చేస్తోంది. యుక్తవయసులో ఉన్న బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్‌లు అందిస్తున్నారు. పాఠశాలల్లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మొబైల్ మెడికల్ డయాగస్టిక్, ట్రీట్‌మెంట్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులను సజావుగా అమలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు చేయి చేయి కలిపి పనిచేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.