ప్రపంచ గతినే మార్చిన ‘మేడే’

'Mayday' changed the course of the world‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని’ మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమే.ఆ శ్రమే దోపిడీకి గురైనప్పుడు ఏమవుతుంది? కష్టించి పని చేసే చేతులు పిడికిళ్లు బిగిస్తాయి.అమెరికాలోని కార్మికులనే కాక ప్రపంచ కార్మికులందరినీ ప్రభావితం చేసిన చికాగో హే మార్కెట్‌ సంఘటన ఇందుకు నిదర్శనం.ఈ ఘటనే మేడేగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం.కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం డిమాండ్‌తో 1886, మే1న 40వేల మంది కార్మికులు నిరసన చేపట్టారు. నేటికి 138 ఏండ్ల క్రితం అమెరికాలోని చికాగో నగర కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కోసం చారిత్రాత్మక పోరాటానికి నాంది పలికారు. ఆ రోజుల్లో పని గంటలకు ఏ నియమమూ లేదు. పొద్దు పొడిచింది మొదలు చీకటయ్యే దాకా కార్మికులు కార్ఖానాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ వుండేవాళ్లు.ప్రారంభ దినాల్లో అమెరికాలో కార్మికులు రోజుకు 12 నుండి 18 గంటల వరకూ శ్రమించేవారు.అత్యధిక కార్మికులు చిన్న వయసులోనే ప్రమాదకరమైన రోగాల బారినపడి చనిపోయేవారు కూడా. దీనికి వ్యతిరేకంగా పోరాడిన కార్మికులపై ప్రయివేటు గూండాలు,పోలీసులు,సైన్యంతో దాడులు చేయించేవాళ్లు.పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. అయితే నిర్బంధం నుంచే ప్రతిఘటన పుడుతుంది.ఆ ప్రతిఘటన పోరాట కాంక్ష అలలను సష్టిస్తుంది.అందుకే అమెరికా కార్మికయోధులు పోరు మార్గాన్ని ఎంచుకున్నారు.
1877 నుంచి 1886 వరకూ ఇక్కడి కార్మికులు దేశవ్యాప్తంగా ఎనిమిది గంటల పనిదినపు డిమాండ్‌ పై ఏకం కావడం,సంఘటితం కావడం ప్రారంభించారు.1886లో అమెరికా అంతటా కార్మికులు ఎనిమిది గంటల కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు.మే 1న కార్మికులందరూ తమ పని ముట్లను పక్కన పెట్టి రోడ్ల మీదికి పోవాలని, ఎనిమిది గంటల పనిదినపు నినాదాన్ని హోరెత్తించాలని చికాగో కార్మికులు నిర్ణయించుకొని అమెరికా అంతటా లక్షలాది కార్మికులు ఒకేసారి సమ్మె ప్రారంభించారు.ఈ సమ్మెలో 11 వేల ఫ్యాక్టరీలకు చెందిన కనీసం 3 లక్షల 80 వేల మంది కార్మికులు పాల్గొన్నారు.చికాగో నగర దరిదాపుల్లోని రైలు రవాణా మార్గమంతా స్థంభించిపోయింది. చికాగోలోని అత్యధిక కార్ఖానాలూ,వర్క్‌ షాపులూ బందయ్యాయి. నగరంలోని ప్రధాన మార్గమైన మిషిగన్‌ ఎవెన్యూపై అల్బర్ట్‌ పార్సన్స్‌ నాయకత్వంలో కార్మికులు ఒక భారీ ర్యాలీ నిర్వహించారు.దీంతో పెరుగుతున్న కార్మికుల బలం,వాళ్ల నాయకుల తొణకని సంకల్పంతో భయభ్రాంతులైన పారిశ్రామిక వేత్తలు కార్మికులపై నిరంతరాయంగా దాడులు చేసే ఎత్తుగడలు అవలంబించారు.అప్పుడు పెట్టుబడిదారుల యాజమాన్యంలోని మొత్తం పత్రికలన్నీ ‘ఎర్ర’ ప్రమాదం గురించి మొత్తుకున్నాయి. పెట్టుబడిదారులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పోలీసులను,సాయుధ బలగాలనూ పిలిపించి మోహరింపజేశారు. వీరితోపాటు కుఖ్యాత పింకర్టన్‌ ఏజెన్సీకి చెందిన గూండాలను కూడా సాయుధం చేసి కార్మికులపై దాడులు చేయడానికి సర్వసన్నద్ధంగా ఉంచి పెట్టుబడిదారులు అత్యవసర స్థితిని ప్రకటించారు. మే 3న మైకార్మిక్‌ హార్వెస్టింగ్‌ మెషీన్‌ కంపెనీ కార్మికులు తమ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయినపుడు నగర పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు చేరుకున్నాయి. కార్మికులు ప్రతిఘటనా సభ ప్రారంభించగానే నిరాయుధ కార్మికులపై తూటాలు కురిపించ బడ్డాయి.నలుగురు కార్మికులు చని పోయారు. చాలా మంది గాయ పడ్డారు. ఆ తర్వాతి రోజు కూడా కార్మిక బందాలపై దాడులు కొనసాగాయి.
ఈ క్రూరమైన పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా మే 4వ తేదీ రాత్రి చికాగో నగర ప్రధాన మార్కెట్‌ అయిన హే మార్కెట్‌ స్క్వేర్‌ వద్ద ఒక ప్రజా సభ జరిగింది. దీంతో పిచ్చెక్కిన పోలీసులు మార్కెట్‌ను నాలుగు వైపులా చుట్టుముట్టి సభికుల పైకి విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలు పెట్టారు. పారిపోవడానికి ప్రయత్నించిన వాళ్ల పైనా తూటాల,లాఠీల వర్షం కురిపించారు. దీంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు.రెండు వందలకు పైగా గాయపడ్డారు.కార్మికులు తమ నెత్తుటితో ఎరుపెక్కిన ఒంటిమీది బట్టలను ఎగిరేసి దానిని కార్మికుల ఎర్రజెండాగా మలిచారు.తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చింది.అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు,నిరసన ప్రదర్శనలు చేపట్టడం మొదలైంది.యూరప్‌లో 1900 నుంచి 1920 వరకూ ప్రభుత్వ,ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసనలు జరిగాయి.మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మేడే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు.తర్వాతి దశకాల్లో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు.హిట్లర్‌ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునేవారు.ఇటలీలో ముస్సోలిని,స్పెయిన్‌లో జనరల్‌ ఫ్రాంకో మే డే పైన అనేక ఆంక్షలను విధించారు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్‌ దేశాల్లో మే1ని సెలవు దినంగా పాటించడం మొదలైంది.ఆ తర్వాత అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. కార్మికులకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలను చాలా దేశాలు ఆ రోజునే అమల్లోకి తీసుకొచ్చాయి.ఆ విధంగా అటు సంక్షేమ పథకాల అమలుతో పాటు నిరసన ప్రదర్శనలకు,కార్మిక పోరాటాలకు మే1 వేదికగా మారింది.వేర్వేరు దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజునే మొదలై పలు ఇతర కార్మిక ఉద్యమాలు కూడా మేడే నాడే ప్రాణం పోసుకున్నాయి.
మన దేశంలో చికాగో సంఘటన కంటే ముందే కల కత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్‌లో అధికారులు ఎన్ని గంటలు పని చేస్తారో మేము కూడా అన్ని గంటలే పని చేస్తామనే డిమాం డ్‌తో 1862లోనే సమ్మె చేశారు. అయితే ఆ సమ్మె విస్తత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడిన తర్వాత కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం వల్ల మన దేశంలో 1923లో మొదటిసారి మేడేను పాటించారు.అప్పటి నుంచి దేశంలో మేడేని పాటిస్తున్నారు.1985 తర్వాత చోటుచేసుకున్న ప్రయివేటైజేషన్‌,లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల కార్మిక చట్టాలు అంతగా అమలుకు నోచుకోవడం లేదు.కార్మికుల పని వాతావరణంతో పాటు వేతనాలు మెరుగవ్వాలన్నది చాలాకాలంగా కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్‌గా మారింది. నేడు మార్కెట్‌ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉంటే అక్కడ కంపెనీలు పెడుతున్నాయి.అమెరికా లాంటి దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కార్మిక చట్టాలు అంతగా అమలు కానటువంటి దేశాల్లో కంపెనీలు పెడుతూ వాళ్ల చేత రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పని చేయిస్తున్నారు.ఇందుకు మన దేశం మినహాయింపేమీ కాదు.పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమదోపిడీ సర్వసాధారణం.కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇచ్చే బహుళజాతి కంపెనీలను మాత్రమే మన దేశంలోకి ఆహ్వానించాలి. అప్పుడేే ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులను శ్రమదోపిడీ నుంచి రక్షించగలమని గ్రహించాలి.ప్రాణాలను పణంగా పెట్టి నాటి కార్మికవర్గ పోరాటాలు సాధించిన ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నప్పటికీ,ఇప్పుడున్న మార్కెట్‌ శక్తుల వ్యూహాలు పాత పరిస్థితులను పునరావతం చేస్తుండటం గమనించాలి.కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, కనీస హక్కులను కాలరాస్తున్న పాలక వర్గాల దుర్నీతిని నేడు కండ్లారా చూస్తున్నాం. ప్రపంచ కార్మికవర్గం పోరాడి సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా కోల్పోయే దుస్థితి దాపురించింది.
ఇప్పుడు మేడే స్ఫూర్తిని మరింత ఉత్తేజంతో కొనసాగించాలి. అందుకు మహాకవి శ్రీశ్రీని గుర్తుకు తెచ్చుకోవాలి.’చిరకాలం జరిగిన మోసం,బలవంతుల దౌర్జన్యాలు,ధనవంతుల పన్నాగాలు ఇంకానా? ఇకపై చెల్లవు.ఒక వ్యక్తిని మరో వ్యక్తి,ఒక జాతిని వేరే జాతీ,పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై సాగదు’ అంటూ ఆయన ఏనాడో చెప్పిన మాటల్లోని ఆంతర్యాన్ని అందరూ గమనించాలి.గడిచిన ఈ 138 ఏండ్లల్లో అసంఖ్యాకమైన పోరాటాల్లో పారిన కోట్లాది కార్మికుల నెత్తురు అంత సులువుగా భూమిలో ఇంకిపోదు.ఉరికొయ్య నుంచి మారుమోగిన కార్మిక నాయకుడు స్పాయిస్‌ గళం ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ పెట్టుబడిదారుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తూనే వుంటుంది. అసంఖ్యాక కార్మికుల నెత్తుటి కాంతితో మెరిసే ఎర్రజెండా ముందుకు నడవడానికి మనకు ప్రేరణనిస్తూనే ఉంటుంది.
(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)
నాదెండ్ల శ్రీనివాస్‌
9676407140

Spread the love