అవినీతిని చట్టబద్ధం చేసిన మోడీ సర్కార్‌

Corruption is legal Made by Modi government– భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
– బీజేపీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించండి
– ఎలక్టోరల్‌ బాండ్స్‌లో అత్యధికం ఆ పార్టీ ఖాతాలోకే..
– భువనగిరిలో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి :పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపు
నవతెలంగాణ-భువనగిరి
అవినీతిని వెలికితీస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్‌.. అవినీతికి చట్టబద్ధత కల్పించింది.. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోంది.. అలాంటి బీజేపీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని.. నిరంతరం ప్రజా సమస్య లపై పోరాడుతున్న.. సీపీఐ(ఎం) అభ్యర్థిగా భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జహంగీర్‌ను గెలిపించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళ వారం భువనగిరి పట్టణంలో ఏఆర్‌ గార్డెన్‌లో ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశంతోపాటు అనంతరం విలేకరుల సమావేశంలోనూ తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి ఆ స్థానంలో మనుధర్మాన్ని తీసుకొచ్చి ఫ్యూడల్‌ పద్ధతులు ప్రవేశపెట్టడం కోసం కృషి చేస్తోందని అన్నారు. అధికారం నిలబెట్టుకునేందుకు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ఇప్పటికే సీఏఏ, పౌరసత్వ చట్టం అమలుకు పూనుకుందని, జ్యోతిష్య శాస్త్రం, వాస్తు వంటివి ప్రవేశపెట్టి విద్యా కాషాయీకరణకు యత్నిస్తోందన్నారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను వేధించడం.. లొంగదీసుకోవడం, ప్రశ్నించే మేధావులను జైళ్లల్లో పెట్టడం లాంటివి చేస్తోందని విమర్శించారు.
బీజేపీ 2014 ఎన్నికల ముందు నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిందన్నారు. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కల్పించిందని విమర్శించారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు అందిన వాటిల్లో అత్యధికం బీజేపీ ఖాతాలోకే చేరాయని చెప్పారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ చట్ట విరుద్ధమైనవని సీపీఐ(ఎం) మొదటి నుంచీ పోరాడిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చిందన్నారు. ఆకలి సూచీలో మనదేశం 111 స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పదేండ్లుగా బీజేపీ చేసిన అవినీతి, అక్రమాలు, ఇచ్చిన హామీలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోందన్నారు. నాడు వ్యాపారస్తులు వేరు, రాజకీయ నాయకులు వేరుగా ఉండేవారని, నేడు వ్యాపారస్థులే రాజకీయ నాయకులుగా మారారని, వారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. వేల కోట్ల రూపాయల అధిపతులు ఎన్నికల బరిలో ఉంటున్నారని, ఎన్నికయ్యాక వారు ఇంకా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నిరంతరం నిజాయితీగా నికరంగా ప్రజా సమస్యలపై పోరాడే జహంగీర్‌ను భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా నిలబెట్టామని, ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాల కొనుగోళ్లపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ సీపీఐ(ఎం) చేసిన ప్రజాపోరాటాలు తెలుసన్నారు. తమ పార్టీ పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టారని చెప్పారు. నకిరేకల్‌, ఇబ్రహీంపట్నం, జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల కోసం పని చేశారన్నారు. భువనగిరి పార్లమెంట్‌ ఏర్పడిన 2009 ఎన్నికల నుంచి సీపీఐ(ఎం) పోటీ చేస్తోందన్నారు.
ఈ పార్లమెంట్‌ పరిధిలో సీపీఐ(ఎం) అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మీ, సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండి.జహంగీర్‌, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాల కార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్‌, మల్లు నాగార్జున రెడ్డి, మోకు కనకారెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, పైళ్ల ఆశయ్య, ఎంవీ రమణ, డబ్బికార్‌ మల్లేశం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దొనూరి నర్సిరెడ్డి పాల్గొన్నారు.

Spread the love