మోడీని అనర్హుడిగా ప్రకటించాలి

– కేంద్ర ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాని మోడీని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివిధ సభల్లో మాట్లాడుతున్న తీరు జుగుప్స కలిగిస్తున్నదని విమర్శించారు.రాజ్యాంగ బద్ధంగా పాలన చేస్తానంటూ ప్రధానిగా ప్రమాణం చేసి దానికి వ్యతిరేకంగా మతోన్మాదిగా దేశ ప్రజలను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న తీరు ఆయన ప్రధాని పదవికి మచ్చ తెస్తున్నదని తెలిపారు. రాజస్థాన్‌లోని సభలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల చర, స్థిర ఆస్తులను ముస్లింలకు పంచి పెడుతుందంటూ మోడీ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను ఆ పార్టీ తగ్గించి ముస్లింలకు ఇస్తుందంటూ ప్రకటించారని పేర్కొన్నారు. చత్తీస్‌ఘడ్‌లో సామాజిక న్యాయం పేరుతో ప్రజల ఆస్తులను లూటీ చేసే ప్రమాదముందంటూ మోడీ మాట్లాడారని తెలిపారు. ప్రధానిగా ఉండి ప్రజల సంపదను బీజేపీ అదానీ, అంబానీలకు దోచిపెట్టిన దాన్ని తిరిగి ప్రజల ఆస్తులుగా మారుస్తారనే భయంతోనే మోడీ ఈ మాటలు మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. ఆయన దృష్టిలో భారత ప్రజలంటే అదానీ, అంబానీ, నీరవ్‌ మోడీ, విజరు మాల్యా వంటి కొద్ది మంది సంపన్నులు తప్ప 140 కోట్ల మంది కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని మోడీని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ లక్ష్యాలను నిలబెట్టాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్య చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. మూడోసారి మోడీ ప్రధాని అయితే ప్రజలు ఐక్యంగా జీవించడం, దేశం ఐక్యంగా ఉండటం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. మతం ఆధారంగా దేశ ప్రజలను చీల్చటం, మతాల మధ్య చిచ్చు పెట్టటం, తద్వారా దేశ సమైక్యతకు నష్టం కలిగించడమే మోడీ గ్యారంటీగా భావించాలని విమర్శించారు. తెలంగాణ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి రాష్ట్రంలోని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్థానం లేకుండా చేయాలని నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడే దేశం సమైక్యంగా ఉంటుందనీ, రాజ్యాంగం రక్షించబడుతుందని తెలిపారు.

Spread the love