అంబేద్కర్‌ కోరుకున్న సమానత్వం రాలేదు

– ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి
– అంబేద్కర్‌ వర్సిటీలో స్మారకోపన్యాసం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంబేద్కర్‌ కోరుకున్న సమానత్వం రాలేదని ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మారకోపన్యాసాన్ని ఇచ్చారు. అంబేద్కర్‌ చిత్రపటానికి లింబాద్రి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం లింబాద్రి మాట్లాడతూ ప్రపంచ సమానత్వాన్ని అంబేద్కర్‌ కోరుకున్నారనీ, అది ఇంకా రాలేదని చెప్పారు. ఆయన దూర దృష్టి గల నేత అని అన్నారు. రాజ్యాంగంలో పొంచుపర్చిన ఆర్టికల్‌ మూడు ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని వివరించారు. స్వాతంత్య్రానికి పూర్వం అంబేద్కర్‌ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారనీ, అంటరానితనం, వివక్ష ఆయన్ను బాగా ఆలోచింప చేశాయని చెప్పారు. రాజ్యంగం పునాది అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే అంశాలపై ఆధారపడి ఉందని వివరించారు. ప్రాథమిక సూత్రాలుగా భారత రాజ్యాంగ పీఠికలోకి సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం, ఆలోచనలు, భావ వ్యక్తీకరణలో నమ్మకాలు, విశ్వాసాల్లో స్వేచ్ఛ, అంతస్తులు, అవకాశాల్లో తేడాలున్న సమాజంలో అందరి మధ్య సమానత్వం సాధించాలని అంబేద్కర్‌ సూచించారని గుర్తు చేశారు. దేశ రాజకీయాలను, పరిపాలనా విభాగాలను వ్యవస్థలను, వనరులను సమానంగా అందరికీ పంచాలని ఆయన కోరుకున్నారని చెప్పారు. అయితే ఇప్పటికే దేశంలోని సంపద కొందరి వద్దే కేంద్రీకృతం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె సీతారామారావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో 25 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ, త్వరలోనే ఆవిష్కరిస్తామని చెప్పారు. అంబేద్కర్‌ ఆశయాలకు యూనివర్సిటీ కట్టుబడి ఉందని వివరించారు. ప్రభుత్వ పరిపాలన శాస్త్రం 75 వసంతాల అంతర్జాతీయ సదస్సు బ్రోచర్‌ను లింబాద్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎవిఆర్‌ఎన్‌ రెడ్డి, డీన్‌ వడ్డాణం శ్రీనివాస్‌, సెమినార్‌ డైరెక్టర్‌ పల్లవి కబ్డే, కో డైరెక్టర్‌ సి వెంకటయ్యచ సీఎస్‌టీడీ డైరెక్టర్‌ ఆనంద్‌ పవార్‌, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ ఎల్వీకే రెడ్డి, పుస్తక ప్రచురణల విభాగం డైరెక్టర్‌ గుంటి రవీందర్‌, ఎస్సీ,ఎస్టీ సెల్‌ ఇన్‌చార్జీ బానోత్‌ ధర్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love