నిజాం లొంగుబాటు… ప్రజలు సాధించిన విజయం

Surrender of Nizam
People's success– హైదరాబాద్‌కూ ఆగస్టు 15నే స్వాతంత్య్రం
– సెప్టెంబర్‌ 17న ప్రజాస్వామ్యబద్ధంగా భారత్‌లో విలీనం
– ముస్లిం రాజును పతనం చేశామంటూ పటేల్‌ ప్రకటించలేదు
– ఎస్వీకే సభలో ప్రొఫెసర్‌ ఇనుకొండ తిరుమలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారతదేశంతోపాటు హైదరాబాద్‌ సంస్థానానికీ 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని చరిత్ర అధ్యాపకులు, ఢిల్లీ విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఇనుకొండ తిరుమలి అన్నారు. అయితే 1948, సెప్టెంబర్‌ 17 వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రక్రియ సాగిందనీ, భారత్‌లో హైదరాబాద్‌ను నిజాం నవాబు విలీనం చేశారని చెప్పారు. ముస్లిం అయిన నిజాం రాజును పతనం చేశామంటూ అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభారు పటేల్‌ ఎక్కడా ప్రకటించలేదని గుర్తు చేశారు. అయితే నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లోని ప్రజలు తిరుగుబాటు చేయకపోతే నిజాం లొంగేవారు కాదన్నారు. భారత సైన్యం, కమ్యూనిస్టుల పోరాటానికి మధ్య నిజాం నలిగిపోయారనీ, అందుకే విలీనం చేశారని వివరించారు. ఇది ప్రజలు సాధించిన ఘనవిజయమన్నారు. ‘హైదరాబాద్‌ విలీనం-వాస్తవాలు’అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యక్ష సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 స్వాతంత్య్రోద్యమం కాదన్నారు. పాకిస్తాన్‌, భారత్‌ రెండు రాజ్యాలుగా విభజించి బ్రిటీష్‌ వారు స్వాతంత్య్రం ప్రకటించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉందంటూ బ్రిటీష్‌ వారికి నిజాం లేఖ రాశారని అన్నారు. అయితే సంస్థానాలు స్వతంత్రంగా ఉండొద్దనీ, ఏదైనా రాజ్యంలో చేరాలంటూ బ్రిటీష్‌ వారు తిరిగి సమాధానమిచ్చారని చెప్పారు. ముస్లిం దేశం కాబట్టి పాకిస్తాన్‌లో చేరాలంటూ జిన్నా నిజాంను విజ్ఞప్తి చేశారని అన్నారు. తన రాజ్యంలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు కాబట్టి భారత్‌లో చేరతానంటూ నిజాం చెప్పారన్నారు. అయితే నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారని వివరించారు. ఇంకోవైపు రజాకార్లు ప్రజలపై దాడులు, అకృత్యాలు చేశారని చెప్పారు. దీంతో అధికారమంతా రజాకార్ల చేతిలో ఉందంటూ నిజాం చెప్పడంతో భారత సైన్యం దిగిందని వివరించారు. 1948, సెప్టెంబర్‌ 17న నిజాం లొంగిపోయి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు అంగీకరించారని అన్నారు. ఆ తర్వాత నిజాంను రాజ్‌ప్రముఖ్‌గా నియమించారని చెప్పారు. ఆధిపత్యం నుంచి ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు చేశారని వివరించారు.
కమ్యూనిస్టుల్లేకుంటే నిజాం లొంగేవారా? : పశ్యపద్మ
సామాన్యులు, రైతులు, మహిళలపై దాడులు, అకృత్యాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అన్నారు. జాగీర్దారీ, జమీందారీ, నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఆయుధాలు పట్టి పోరాడారని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల పోరాటం లేకుంటే నిజాం లొంగేవారా?అని ప్రశ్నించారు. ఇది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా సాగిన పోరాటమంటూ బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. షేక్‌బందగీ, షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు చంపారని గుర్తు చేశారు. ఇది హిందూ, ముస్లింల మధ్య గొడవ కాదనీ, పీడన, అణచివేత, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిందన్నారు. ఇది జాతీయ సమైక్యతా దినోత్సవం కాదని చెప్పారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్‌ చేశారు. సాయుధ పోరాటంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదన్నారు. ఉద్యమ వారసులు కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలను ప్రజలకు అందించేందుకు కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు.
విమోచన పేరుతో బీజేపీ రాజకీయం : నంద్యాల నర్సింహారెడ్డి
విమోచన పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని చెప్పారు. ముస్లిం రాజు నుంచి హిందువులకు విమోచన వచ్చిందంటున్న బీజేపీ, కాశ్మీర్‌లో హిందూ రాజు నుంచి ముస్లిం ప్రజలకు విమోచన వచ్చిందంటూ ఎందుకు చెప్పడం ప్రశ్నించారు. బీజేపీ ప్రమాదాన్ని ప్రజలంతా గుర్తించాలనీ, అవకాశవాద రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు దేశం సమైక్యంగా లేదా?అని ప్రశ్నించారు. హిందూ, ముస్లింల ఓట్ల కోసమే బీఆర్‌ఎస్‌ జాతీయ సమైక్యత పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నదని చెప్పారు. ఎస్వీకే ట్రస్టు సభ్యులు సి సాంబిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎస్వీకే ప్రతినిధి జి బుచ్చిరెడ్డి, ఎం సోమయ్య, టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love