ఏదీ ‘ఆధారం’

– ఏడాది కాలంగా నిలిచిపోయిన ఆధార్‌ నమోదు
– పది మండలాల్లోని ప్రజలకు తప్పని ఆధార్‌ ఇబ్బందులు
– ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌కు నరకయాతన
– జిల్లాల్లో పని చేస్తున్నవి పరిమిత కేంద్రాలే
– కేంద్ర, రాష్ట్ర పరిధుల్లోని కేంద్రాల మధ్య వార్‌
– కోర్టును ఆశ్రయించిన రెండు ప్రభుత్వాల పరిధిలోని సెంటర్ల నిర్వహకులు
– రాష్ట్ర పరిధి సెంటర్ల తెరుచుకునేందుకు గ్రీన్‌ సిగల్‌
ఇప్పుడు ఆధార్‌కార్డు సర్వరోగ నివారిణిగా మారింది. బ్యాంక్‌ ఖాతా నుంచి మొదలు.. పింఛన్‌ డబ్బులు.. రేషన్‌ సరుకులు తీసుకునే దాకా ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఇటీవల ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలని చెబుతుండటంతో ప్రజలు కేంద్రాలకు బారులు తీరుతున్నారు. దాంతో ఆధార్‌ కేంద్రాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలు దాటి పోతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం బారులు తీరుతున్నారు. కూలీలు వ్యవసాయ పనులు మానేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు సెలువులు పెడుతున్నారు. అయినా ఒక్క రోజుతో ఆధార్‌ అప్‌డేట్‌ కావడం లేదు. రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అయినా సంవత్సరాల తరబడి మూతపడిన ఆధార్‌ కేంద్రాలను ఓపెన్‌ చేయడం లేదు. ఇటు మండల స్థాయిలో పర్యవేక్షించాల్సిన తహసీల్దార్లు, అటు జిల్లా స్థాయి ఈడీఎం అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక ప్రజలు, విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

పది మండలాల్లో కేంద్రాల మూత
జిల్లాలోని పది మండలాల్లో ఆధార్‌ కేంద్రాలు మూత పడ్డాయి. కొన్ని మండలాల్లో ఏడాదికి పైగా కేంద్రాలు తెరుచుకోవడం లేదు. మరి కొన్ని ప్రాంతాల్లో ఆరు మాసాల నుంచి మూత పడ్డాయి. ఇక అధికారుల నుంచి మాత్రం తమ పరిధి కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు మాత్రం నిత్యం ఆధార్‌ కేంద్రాల కోసం వెంపర్లాడుతున్నారు. ఒకటీ నాలుగైదు మండలాల్లో ఒకటీ రెండు కేంద్రాలు మాత్రమే పని చేస్తున్నాయి. మహేశ్వరం, తలకొండపల్లి, మంచాల, మాడ్గుల, ఆమన్‌గల్‌, చౌదర్‌గూడ, ఆబ్దుల్లాపూర్‌మెట్‌, కొత్తూర్‌ ఆధార్‌ కేంద్రాలు మూతపడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కేవలం రెండు కేంద్రాలు మాత్రమే పని చేస్తున్నాయి. ఇక ఉన్న ఒకటీ రెండు కేంద్రాల్లో పోటెత్తుతున్న వినయోగదారులతో ఆధార్‌ కేంద్రం నిర్వహకులు చేతులెత్తేస్తున్నారు. తాము ఈ ఒత్తిడిని బరించలేమంటున్నారు.
అవసరం ఎక్కువ.. కేంద్రాలు తక్కువ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేసింది. విద్యార్థులకు అత్యవసరమైంది. అయితే ప్రజల అవసరాల మేరకు కేంద్రాలు నిర్వహించాల్సిన అవసరముంది. కానీ ఆ మేరకు కేంద్రాలను ఏర్పాటు చేసినా సరిగ్గా నడపడం లేదు. ఈ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయిలో ఈడీఎం, మండల స్థాయిలో తహసీల్దార్‌ నిరంతర పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క రోజు అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. కాగా, కొన్ని ఇబ్రహీంపట్నం ఒకటీ, యాచారంలో రెండు, కడ్తాల్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, హయత్‌నగర్‌ మండలాల్లో ఒక్కొ కేంద్రం చొప్పున పని చేస్తున్నాయి. ఈ కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇక్కడ పని చేస్తున్న మరికొన్ని కేంద్రాలను అధికారులు మూత వేయించారు. ఆధార్‌ కేంద్రంలో తప్పుడు డాక్యుమెంట్లు చూపడం, ఏదో ఒక ఆధారం చూపి పుట్టిన తేదీ మార్చడం, వయస్సు మార్చడం, ఇంటి పేరు, ఇతర చిరునామాలు ఏదో ఒక సర్టిఫికెట్‌ చూపి మార్చడం సమస్యగా మారిందని నిర్వహకులు చెబుతున్నారు. దరఖాస్తుదారులు తెచ్చే వివిధ సర్టిఫికెట్లు ఒరిజినలా? డూప్లికేటా? తెలియక పోవడం వల్ల ఆధార్‌ సెంటర్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత డీవో 1 ఎర్రర్‌ అని రావడంతో సెంటర్లు సస్పెండ్‌ అవుతున్నాయని చెబుతున్నారు.
ఆధార్‌ సేవలు అందక ఇబ్బందులు
ఆధార్‌ కేంద్రాలు మూతపడిన మండలాల్లో ఆధార్‌ సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో సెంటర్‌ మాత్రమే ఉన్న ఇబ్రహీంపట్నం, యాచారం, కడ్తాల్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, హయత్‌నగర్‌ మండలాల ప్రజల బాధలు వర్ణనాతీతం. 23 గ్రామ పంచాయతీలున్న మంచాల మండలంలో ఒక్క కేంద్రం కూడా లేకపోవడంతో వారు ఇతర మండలాలకు పరుగులు పెడుతున్నారు. ఇబ్రహీంపట్నం, యాచారం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మర్రిగూడ, నారాయణపూర్‌ మండలాలకు వెళ్లి ఖర్చుతో పాటు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో మూతపడ్డ ఆధార్‌సెంటర్లు తెరిపించాలని కోరుతున్నారు.
ఇదీ ఒక కారణమే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా నిర్వహిస్తున్న ఆధార్‌ కేంద్రాల మధ్య వార్‌ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పరిధిలోని కేంద్రాలు మూత పడ్డాయి. రాష్ట్ర పరిధిలోని నడిచే ఆధార్‌ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం బావించింది. ఆపరేటర్లకు నెలకు రూ.12500 వేతనం ఇచ్చి నిర్వహిం చాలని చూసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆధార్‌ కేంద్రాలను నడిపించే నిర్వహకులు కోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొన్ని సెంటర్లు మూతపడ్డాయని కూడా నిర్వహకులు చెబుతున్నారు. దాంతో కోర్టు కూడా రాష్ట్ర పరిధిలో నడిచే నిర్వహకుల పక్షమే తీర్పునిచ్చింది. ఇప్పటి వరకు మూత పడిన కేంద్రాలను వారం పదిరోజుల్లో తెరుచుకునే అవకాశాలు న్నాయని నిర్వహకులు పేర్కొంటున్నారు.

 

Spread the love