నేడు ఎన్టీఆర్‌ రూ.వంద నాణేం ఆవిష్కరణ

– ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల
– సందర్భంగా విడుదల చేయనున్న రాష్ట్రపతి ముర్ము
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఎన్టీఆర్‌ నాణేన్ని నేడు (సోమవారం) ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్‌ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంది.ఎన్టీఆర్‌ రూ.వంద నాణెం విడుదల కార్యక్రమానికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఎన్టీర్‌ నాణేం విడుదల తరువాత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో దొంగ నోట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.

Spread the love