చెరువుల ‘కబ్జా’

కనిపించని బఫర్‌ జోన్లు
మొరంతో పూడ్చేసి ఇండ్ల నిర్మాణాలు
– శిఖం భూములు,ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెంచర్లు, కాలనీలు
– బడా నాయకుల చేతుల్లో శిఖం భూములు
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
చెరువులు, కుంటలకు రక్షణ లేకుండా పోయింది. బఫర్‌ జోన్లు కనిపించడం మాయమవుతున్నాయి.. తూములు కనుమరుగవుతున్నాయి.. భూముల ధరలు పెరగడంతో.. రియల్‌ మాఫియా చెరువులు, శిఖం భూములను మొరంతో పూడ్చేసి వెంచర్లు, కాలనీలు ఏర్పాటు చేస్తోంది. ఆ పరిధిలో ఇండ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇందులో కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఉంటున్నారు. ఎప్పటికప్పుడూ చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాల్సిన అధికారులు అక్రమార్కులకే సపోర్ట్‌ చేస్తుండటంతో హద్దులు చెరిగిపోతున్నాయి. దీంతో చెరువుల గొలుసుకట్టు కూడా తెగిపోయి వరద నీరంతా వృథాగా కృష్ణానదిలో కలుస్తోంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 ఎకరాల్లోపు విస్తీర్ణం ఉన్న చెరువులకు, 9 మీటర్లు, 25 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు 30 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ ఉండాలి. ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలకూ అనుమతి ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధనలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ప్రజాప్రతినిధుల అండతో ఆక్రమణదారులు చెరువులను మొరంతో పూడ్చి ఇండ్లు కట్టి అమ్మకానికి పెడుతున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పెద్దచెరువు, నాగర్‌కర్నూల్‌ పట్టణ సమీపాన ఉన్న కేసరి సముద్రం, పుట్నాల చెరువు, తెలకపల్లి పెద్ద చెరువు ఆక్రమణలకు గురవుతున్నాయి. 60 ఎకరాలకు పైగా ఉండాల్సిన మహబూబ్‌నగర్‌ పెద్ద చెరువు 20 ఎకరాలకు కుచించుకుపోయింది. నాగర్‌ కర్నూల్‌ కేసరి సముద్రం ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 30 ఎకరాలకు పరిమితమైంది.
ఆగని ఆక్రమణలు
అక్రమార్కులు చెరువులను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపాన ఉన్న వడ్లోనికుంట గతంలో 70 ఎకరాలకు సాగు ఇచ్చేది. లింగాల పట్టణానికి చెందిన ఓ ప్రముఖ నాయకుడు ఈ చెరువు శిఖం భూములన్నీ రియల్‌ ఎస్టేట్‌గా మార్చి అమ్ముకున్నారు. వ్యవసాయ బావులను సైతం ధ్వంసం చేశారు. నాగర్‌ కర్నూల్‌, కొల్లాపూర్‌ రహదారి సమీపాన జరుగుతున్న ఈ అక్రమాలు అధికారులకుగానీ ప్రజాప్రతినిధులకుగానీ కనబడకపోవడం విచిత్రం. ఇక్కడి భూముల్లో వెనుకబడిన తరగతులకు చెందిన వారివే అధికంగా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌ గ్రామ సమీపాన నరసింహ కుంటను కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మొరంతో పూడ్చివేసి రియల్‌ ఎస్టేట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీలు టిప్పర్లతో రాత్రింబవళ్లు చెరువును పూడ్చుతున్నారు. గతంలో ఈ చెరువు కింద 50 ఎకరాలకు పైగా సాగు అయ్యేది. ప్రస్తుతం చెరువును పూర్చడంతో ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. ఈ చెరువు పూడ్చివేతలో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తమున్నట్టు సమాచారం. ఇదే గ్రామంలోఉన్న శేషయ్య చెరువు కూడా పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. తూములు బంద్‌ చేసి అలుగులు విప్పేశారు. సాతాపూర్‌ గ్రామ సమీపాన ఉన్న రసూల్‌ కుంట పాతినేని చెరువు సైతం కనుమరుగవుతున్నాయి. గతంలో ఈ చెరువుల నుంచి సాగునీరు వచ్చి పంట పొలాలు కళకళలాడేవి. నేడు నీళ్లు లేక పశుపక్షాదులకు దాహార్తి కూడా తీరడం లేదు.
తెగిన గొలుసుకట్టు
ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం కాకతీయులు అప్పట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సుమారు 6575 గొలుసుకట్టు చెరువులు, కుంటలు నిర్మించారు. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ విస్తరించడం, కబ్జాలు పెరిగిపోవడం వల్ల సుమారు 1250 చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో గొలుసుకట్టు తెగిపోయి అధిక వర్షాలు వస్తే నీరంతా కృష్ణానది పాలవుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు మొత్తం పంట పొలాలు నీట మునిగాయి. చెరువులు, ఆనకట్టలు ఉంటే వరదలు తగ్గేవి.
కబ్జాదారులను కట్టడి చేయాలి
వర్ధం పర్వతాలు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- నాగర్‌కర్నూల్‌
నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఊరకుంటలు, చెరువులు కబ్జా అవుతున్నాయి. ముఖ్యంగా కేసరి సముద్రాన్ని కొంతమంది కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి ఫామ్‌హౌస్‌లు నిర్మించారు. ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో బఫర్‌ జోన్‌ పరిమితిని నియమించారు. అయినా అక్రమాలు ఆగడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎఫ్‌టిఎల్‌ నిర్ణయించి ఆక్రమణ నుంచి రక్షించాలి.

Spread the love